జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందే ఓటేసేలా ఏర్పాట్లు

జూబ్లీహిల్స్ బై ఎలక్షన్.. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1,200 మందే ఓటేసేలా ఏర్పాట్లు
  •     రియల్‌‌ టైమ్ పర్యవేక్షణకు ఏఐ వాడకం
  •     జీపీఎస్ ట్రాకింగ్, డిజిటల్ డ్యాష్‌‌ బోర్డుల వినియోగం
  •     ఎన్నికల రూల్స్ పాటించి సిబ్బందికి సహకరించాలి
  •     పొలిటికల్ పార్టీల మీటింగ్​లో సీఈఓ సుదర్శన్​ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) సుదర్శన్ రెడ్డి కోరారు. జూబ్లీహిల్స్‌‌ బై ఎలక్షన్​ షెడ్యూల్‌‌ ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ సమావేశం నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్, ఆమ్ ఆద్మీ, ఎంఐఎం సహా పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ.. కొన్ని సరికొత్త మార్పులతో ఈ సారి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇవి బిహార్​అసెంబ్లీ ఎన్నికలతోపాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమలు చేస్తున్నట్టు వెల్లడించారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది మాత్రమే ఓటేసేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 

పోటీలో ఉన్న అభ్యర్థుల కలర్ ఫొటోలను ఈవీఎంలపై ఉంచనున్నట్టు తెలిపారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం వీల్‌‌ చైర్లు, ర్యాంపులు, పికప్, డ్రాపింగ్​ఏర్పాట్లపై దృష్టి సారించామన్నారు. రియల్‌‌ టైమ్‌‌లో ఓటింగ్​ను పర్యవేక్షించేందుకు డిజిటల్ డ్యాష్‌‌ బోర్డులు, మొబైల్ యాప్‌‌లను ఉపయోగిస్తామని, ఏఐ ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్‌‌ ట్రాకింగ్ అమలు చేయనున్నట్లు చెప్పారు. 

ఎన్నికల నియమావళి  ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకునేందుకు టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో అదనపు సీఈవో లోకేశ్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ. కర్ణన్, డిప్యూటీ సీఈవోలు హరిసింగ్, సత్యవాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.