సెస్‌‌ చైర్మన్‌‌పై అవిశ్వాసం ?

సెస్‌‌ చైర్మన్‌‌పై అవిశ్వాసం ?
  • చైర్మన్‌‌ ఏకపక్ష నిర్ణయాలతో డైరెక్టర్ల అసంతృప్తి
  • రెండు రోజుల కింద కేటీఆర్‌‌ను కలిసిన ముగ్గురు డైరెక్టర్లు

రాజన్నసిరిసిల్ల, వెలుగు : సహకార విద్యుత్‌‌ సరఫరా సంఘం (సెస్‌‌) చైర్మన్‌‌పై అవిశ్వానికి డైరెక్టర్లు పావులు కదుపుతున్నారు. చైర్మన్‌‌ చిక్కాల రామారావుపై అసంతృప్తితో ఉన్న వైస్‌‌ చైర్మన్‌‌ కోనరావుపేట డైరెక్టర్‌‌ దేవరకొండ తిరుపతి, ఎల్లారెడ్డిపేట డైరెక్టర్ వరుస కృష్ణహరి, ముస్తాబాద్‌‌ డైరెక్టర్‌‌ సందుపట్ల అంజిరెడ్డి కేటీఆర్‌‌ను కలిసి రామారావును తొలగించాలని కోరినట్లు సమాచారం. 

చైర్మన్‌‌ ఏకపక్ష నిర్ణయాలతో అసంతృప్తి

సెస్‌‌ పాలకవర్గ ఎన్నికలు 2022లో జరుగగా మొత్తం 15 డైరెక్టర్‌‌ స్థానాలను బీఆర్‌‌ఎస్సే గెలుచుకుంది. కేటీఆర్‌‌ ప్రధాన అనుచరుడైన చిక్కాల రామారావును చైర్మన్‌‌గా, దేవరకొండ తిరుపతిని వైస్‌‌చైర్మన్‌‌గా ఎన్నుకున్నారు. ఆరు నెలల నుంచి తమను సంప్రదించకుండానే చైర్మన్‌‌గా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారని డైరెక్టర్లు వాపోతున్నారు. 

మరో వైపు సెస్‌‌ ఆఫీస్‌‌లో ఫేస్‌‌ రికగ్నైజేషన్‌‌ సిస్టమ్‌‌ అమల్లోకి తేవడం, సెస్‌‌ లైన్‌‌మెన్లు, ఇతర ఉద్యోగులు ఫీల్డ్‌‌ మీదకు వెళ్లినప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని రూల్స్‌‌ పెట్టడం, వాటిని పాటించని వారికి మోమోలు జారీ చేస్తామని హెచ్చరించడంతో ఉద్యోగులు సైతం చైర్మన్‌‌పై గుర్రుగా ఉన్నారు. 

మరో వైపు పోల్స్‌‌కు ఎర్తింగ్ కోసం 2,500 పైపులు ఆర్డర్లు ఇవ్వగా.. ఒక్కో పైపు ధర రూ.1,600 అయితే దానిని రూ.2,300 నిర్ణయించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఇటీవల వివిధ పనుల కోసం రూ.50 లక్షల మెటీరియల్‌‌ కొనుగోలు చేయగా.. ఇందులో సైతం గోల్‌‌మాల్‌‌ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో అసంతృప్తితో ఉన్న ముగ్గురు డైరెక్టర్లు రెండు రోజుల కింద కేటీఆర్‌‌ను కలిసి.. చైర్మన్‌‌ చిక్కాల రామారావును తొలగించాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంపై త్వరలోనే మాట్లాడుదాం అని కేటీఆర్‌‌ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 

ఒకే వేళ చైర్మన్‌‌పై అవిశ్వాసం పెడితే... కాంగ్రెస్‌‌లో చేరిన బోయిన్‌‌పల్లి డైరెక్టర్‌‌ కొట్టెపల్లి సుధాకర్, వేములవాడ టౌన్‌‌ -1 డైరెక్టర్  నామాల ఉమ చైర్మన్‌‌కు వ్యతిరేకంగానే ఉండనున్నారు. వీరు కాకుండా.. మరో నలుగురు డైరెక్టర్లు కాంగ్రెస్‌‌ లీడర్లతో టచ్‌‌లో ఉన్నట్లు తెలుస్తోంది. సెస్‌‌ చైర్మన్‌‌ను మార్చేందుకు కేటీఆర్‌‌ నిర్ణయం తీసుకోకపోతే పార్టీని వీడేందుకు కొంత మంది డైరెక్టర్లు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.