ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గలేదు :  చాడ వెంకట్ రెడ్డి

కరీంనగర్ : తెలంగాణ రాష్ర్టంలో ధరణి పోర్టల్ తో అవినీతి తగ్గిందనడం నిజం కాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధరణికి సమాంతరంగా మాన్యువల్ రికార్డులు కూడా ఉండాలన్నారు. ధరణిలో తప్పుల వల్ల చాలా మంది రైతుల బతుకులు బజారున పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వే నెంబర్ల వారీగా చేస్తామన్న భూ సర్వే ఏమైందని ప్రశ్నించారు. పోడు భూముల పట్టాల కోసం11 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే.. 4 లక్షల మందికే ఇస్తే.. మిగతా వారి సంగతి ఏంటని ప్రశ్నించారు. కరీంనగర్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చాడ వెంకట్ రెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

తెలంగాణలో పొత్తులపై తమ పార్టీ (సీపీఐ) జాతీయ కమిటీలో చర్చించి.. నిర్ణయం తీసుకుంటుందని చాడ వెంకట్ రెడ్డి చెప్పారు. తెలంగాణలోనూ ప్రజాతంత్ర, లౌకికవాద విశాల వేదిక కోసం ప్రయత్నిస్తామన్నారు. ప్రజల కోరిక మేరకే తాము పని చేస్తామని చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సీపీఐ పోటీ చేయాలన్న ఆలోచన ఉందన్నారు. కమ్యూనిస్టులు పార్లమెంటులో లేకపోవడం వల్ల ప్రజల గొంతు మూగబోయిందని చాలా సర్వేలు చెబుతున్నాయన్నారు. జూన్ 4వ తేదీన కొత్తగూడెంలో బీజేపీ హటావో దేశ్ కి బచావో అనే నినాదంతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.