
ధర్మారం, వెలుగు : పింఛన్ డబ్బులు ఇప్పిస్తానని వృద్ధురాలి పుస్తెల తాడు కొట్టేసి పరారైన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ధర్మారం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన ప్రకారం.. ధర్మారం మండల కేంద్రానికి చెందిన బుదారపు శంకరమ్మ(70) శుక్రవారం ఉదయం కూరగాయలు కొనేందుకు మెయిన్ రోడ్డు వద్దకు వెళ్లింది. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమెతో మాటలు కలిపి పంచాయతీ కార్యదర్శినని చెప్పాడు.
పింఛన్ డబ్బులు వచ్చాయని, ఇప్పిస్తానని శంకరమ్మను నమ్మించి కొద్ది దూరం తీసుకెళ్లాడు. అక్కడ బెంచి మీద కూర్చోబెట్టి, మెడలో పుస్తెల తాడు తీసిస్తే ఫొటో తీసి బ్యాంక్ ఆఫీసర్ కు పంపి పింఛన్ డబ్బులు వచ్చేలా చేస్తానని సూచించాడు. అతను చెప్పినట్టే ఆమె చేసింది. డబ్బులు తీసుకొస్తానని వెళ్లిన అతడు ఎంతకూ తిరిగిరాలేదు. వృద్ధురాలు లబోదిబోమంటూ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులు చెప్పింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.