ఉత్తుత్తి బ్యాంకు పెట్టి 140 కోట్లు మోసం

ఉత్తుత్తి బ్యాంకు పెట్టి 140 కోట్లు మోసం
  • ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ మాయ
  • స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో 330 బ్రాంచీలు ఏర్పాటు
  • పీఎం ముద్రా యోజనకు అనుబంధ సంస్థగా ప్రచారం
  • బ్యాంకుగా చెప్పుకుంటూ కూలీల నుంచి బిజినెస్​మెన్ల దాకా వసూలు
  • సొసైటీ చైర్మన్‌ రామదాసప్ప, కుమారుడు సాయికిరణ్‌ను అరెస్ట్‌ చేసిన సీఐడీ

హైదరాబాద్, వెలుగు: ప్రధాన మంత్రి ముద్రా యోజన స్కీమ్‌‌, సొసైటీలో డిపాజిట్ల పేరుతో రూ.140 కోట్లు కొల్లగొట్టిన ఘరానా మోసగాళ్లను రాష్ట్ర సీఐడీ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. ముద్రా అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌‌మెంట్ మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని నమ్మించి 2వేల మందిని మోసం చేసిన తిప్పెనేని రామదాసప్ప నాయుడు (61)ను అమరావతిలో.. ఆయన కుమారుడు సాయికిరణ్ (43)ను మంగళవారం హైదరాబాద్‌‌లో అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి చంచల్‌‌గూడ జైలులో రిమాండ్‌‌కు తరలించారు. ఈ మేరకు సీఐడీ చీఫ్ శిఖాగోయల్‌‌ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.  

కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థగా ప్రచారం

ఏపీలోని అమరావతికి చెందిన తిప్పెనేని రామదాసప్ప నాయుడు, ఆయన కుమారుడు సాయికిరణ్ సహా మరికొంత మంది కలిసి ప్రధానమంత్రి ముద్రా యోజన పేరుతో ముద్రా ఆగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌‌మెంట్ మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీని స్థాపించారు. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థగా ప్రచారం చేశారు. ‌‌సొసైటీ అతి త్వరలోనే బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహించబోతున్నదని నిరుద్యోగ యువతను నమ్మించారు. తమ సంస్థ ఆధ్వర్యంలో 2వేల మందికి గవర్నమెంట్ మార్కెటింగ్ సూపర్‌‌ వైజర్లుగా ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నట్లు తెలుగు పత్రికల్లో  ప్రకటనలు ఇచ్చారు.  సొసైటీ సభ్యులందరూ శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా నియమితులవుతారని ప్రచారం చేశారు. ఈ ప్రకటనలను నమ్మిన తెలంగాణ, ఏపీలోని అనేక మంది యువకులు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగాల్లో చేరేందుకు ఆసక్తి చూపి తమను సంప్రదించిన వారి నుంచి ఒరిజినల్ సర్టిఫెకెట్లను డిపాజిట్‌‌ చేయించుకున్నారు.

330 బ్రాంచీలు.. 1600 మంది ఉద్యోగులు

తెలంగాణ, ఏపీలో 330 బ్రాంచీలను ఓపెన్‌‌ చేశారు. 1600 మంది ఉద్యోగులను నియమించారు. వీరి వద్ద సెక్యూరిటీ కింద షేర్ క్యాపిటల్, ఇన్వెస్ట్‌‌మెంట్ బాండ్ల పేరుతో డబ్బులు సేకరించారు. మార్కెటింగ్ సూపర్‌‌ వైజర్ల పేరుతో ఉద్యోగులుగా చేరిన వారికి సొసైటీలో డిపాజిట్లు చేయించాలని టార్గెట్లు విధించారు. ముద్రా ఆగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌‌మెంట్ మల్టీ-స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంకుగా పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ మేరకు రైతులు, నిరుద్యోగ యువతను రుణాలు, తమ సొసైటీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో లాభాలు వస్తాయని నమ్మించారు. 

ఇందుకుగాను రైతులు, రోజువారి కూలీలు, నిరుద్యోగ యువత నుంచి డిపాజిట్లు సేకరించే బాధ్యతలను మార్కెటింగ్ సూపర్‌‌‌‌వైజర్లకు  అప్పగించారు.  ఇలా రోజువారీ కూలీలు, రైతులు, చిన్న వ్యాపారుల నుంచి డిపాజిట్లు సహా ఏపీఐఐసీ లిమిటెడ్‌‌ ఇండస్ట్రియల్‌‌లో ప్లాట్స్‌‌లో ఇన్వెస్ట్‌‌ చేస్తామని రూ. 140 కోట్లు సేకరించారు. ఆ  తర్వాత సొసైటీలో డిపాజిట్ చేసిన వారికి రిటర్న్‌‌లు, ఉద్యోగుల వద్ద తీసుకున్న సెక్యూరిటీ డిపాజిట్లు తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు గురిచేశారు. దీనిపై తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్‌‌స్టేషన్లలో నమోదైన కేసులన్నీ కలిపి సీఐడీ దర్యాప్తు చేసింది. దర్యాప్తులో భాగంగా ఇద్దరు కీలక నిందితులైన రామదాసప్ప నాయుడు, ఆయన కుమారుడు సాయికిరణ్‌‌ను అరెస్ట్‌‌ చేసి రిమాండ్‌‌కు తరలించింది.