కోరం లేకపోయినా బడ్జెట్లు, తీర్మానాలకు ఆమోదం

కోరం లేకపోయినా బడ్జెట్లు, తీర్మానాలకు ఆమోదం
  • పని తీరు నచ్చక అవిశ్వాస నోటీసులు ఇచ్చినా డోంట్ కేర్ 
  • చట్టంలో ఉన్న వెసులుబాట్లతో పంతం నెగ్గించుకుంటున్న చైర్ పర్సన్లు
  •  రగిలిపోతున్న అధికార పార్టీ కౌన్సిలర్లు 
  •  పట్టించుకోని పార్టీ పెద్దలు

కరీంనగర్, వెలుగు: జిల్లాలోని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్ పర్సన్లకు, కౌన్సిలర్లకు పొసగడం లేదు. తమపై కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులు ఇచ్చినా, మెజార్టీ సభ్యులు గ్రూపులు కట్టినా మున్సిపల్ చైర్మన్లు/చైర్ పర్సన్లు ఏ మాత్రం తగ్గడం లేదు. మున్సిపల్ యాక్ట్ లో ఉన్న వెసులుబాట్లతో తమ పంతం నెగ్గించుకుంటున్నారు. పూర్తిస్థాయిలో కోరం లేకపోయినా వార్షిక బడ్జెట్లు, తీర్మానాలను ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంటున్నారు. తమను లెక్క చేయడం లేదని, తమ వార్డుల్లో అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఇప్పటికే రగిలిపోతున్న కౌన్సిలర్లకు.. చైర్మన్ల దూకుడు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అధికార పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న కౌన్సిలర్ల అసమ్మతి ఎటు దారి తీస్తుందోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది. 

ఐదు మున్సిపాలిటీల్లో అసమ్మతి రాగం 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల మున్సిపాలిటీలో మొదలైన అవిశ్వాస పర్వం.. మరో నాలుగు మున్సిపాలిటీలకు విస్తరించిన విషయం తెలిసిందే. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ గా ఉన్న బోగ శ్రావణి తనపై అవిశ్వాస తీర్మాన ప్రతిపాదనను కలెక్టర్ కు సమర్పించకముందే తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ ప్రోద్భలంతోనే తనపై కుట్ర జరిగిందని ఆమె అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆ తర్వాత హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధికపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ కలెక్టర్ కు 25 మంది కౌన్సిలర్లు లెటర్​అందజేశారు. ఆమె హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్టే విధించింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చైర్ పర్సన్ ముత్యం సునీతపై అవిశ్వాసం ప్రకటిస్తూ 11 మంది కౌన్సిలర్లు కలెక్టర్ కు ఫిబ్రవరి 13న నోటీసులు అందజేశారు. చొప్పదండి మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజపై, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కౌన్సిలర్లు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ.. కలెక్టర్లకు లెటర్ ఇచ్చేవరకు వెళ్లలేదు. జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాతో అధికార పార్టీలో అసమ్మతి చల్లారినప్పటికీ.. మిగతా మున్సిపాలిటీల్లో ఆ వేడి చల్లారలేదు. 

కోరం లేకపోయినా..

ఇటీవల కరీంనగర్ జిల్లా కొత్తపల్లి, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో బడ్జెట్ సమావేశాలకు కౌన్సిలర్లు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. అయినా చైర్ పర్సన్లు సర్వసభ్య సమావేశం నిర్వహించి వచ్చిన సభ్యులతో తీర్మానాలను, బడ్జెట్ ను ఆమోదింపజేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ మున్సిపాలిటీలో 30 మంది కౌన్సిలర్లకుగాను 21 మంది చైర్ పర్సన్ గందె రాధికపై అవిశ్వాసం పెట్టారు. అయినా తనతోపాటు 8 మంది కౌన్సిలర్లతో చైర్ పర్సన్ ఈ నెల 6న సమావేశం ఏర్పాటు చేశారు. కోరం లేకపోవడంతో 8న సమావేశమై ఎజెండాలోని 64 అంశాలపై చర్చించి 59 అంశాలకు ఆమోదముద్ర వేసుకున్నారు. కొత్తపల్లి మున్సిపాలిటీలో కూడా కోరం లేకపోవడంతో ఒక రోజు సమావేశం వాయిదా వేసి మరుసటి రోజు బడ్జెట్ ను, ఇతర తీర్మానాలను ఆమోదింపజేసుకున్నారు. దీనిపై కమిషనర్లను వివరణ అడిగితే..  జీఓ నంబర్ 216లోని సెక్షన్ 4(2)లో ఇచ్చిన వెసులుబాటు మేరకు మొదటిసారి కోరం(మూడింట ఒక వంతు సభ్యులు) లేకుంటే సమావేశాన్ని వాయిదా వేయొచ్చని, ఆ తర్వాత 24 గంటల్లోపు నిర్వహించే సమావేశానికి కోరం లేకపోయినా తీర్మానాలు చేసి ఆమోదించుకోవచ్చని సమాధానమిస్తున్నారు. తాము లేకపోయినా తీర్మానాలు ఆమోదం పొందడంపై కౌన్సిలర్లు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఇలాంటి వెసులుబాట్లు కలిపిస్తే తమకు విలువేం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోరం లేకుంటే తీర్మానాలు చేయలేరని, చైర్ పర్సన్ దిగి వస్తుందని అసమ్మతి కౌన్సిలర్లు అనుకుంటున్న తరుణంలో జీఓను అడ్డుపెట్టుకొని తీర్మానాలు చేయటంతో వారు రగిలిపోతున్నారు.24 గంటల్లోపే సమావేశం పెట్టుకోవచ్చని జీవోలో ఉంటే హుజురాబాద్ 24 గంటలు గడిచిన తర్వాత సమావేశం నిర్వహించడం రూల్స్ కు విరుద్ధమేనని, ఆ తీర్మానాలు చెల్లవని అసమ్మతి కౌన్సిలర్లు వాదిస్తున్నారు.  అంతేగాక ఎజెండాలో లేని 16 అంశాలను చైర్ పర్సన్ ఎలా ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

పార్టీ పెద్దలు పట్టించుకోవట్లే..

మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్లపై కౌన్సిలర్లు అసమ్మతి వ్యక్తం చేస్తున్నా, అవిశ్వాస నోటీసులు ఇచ్చినా అధికార పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడం కౌన్సిలర్లను బాధిస్తోంది. కౌన్సిలర్లంతా ఒక్కతాటిపైకి వచ్చినా చైర్ పర్సన్ల మాటే నెగ్గుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కూర్చోబెట్టి మాట్లాడుతామని చెప్తూ ఎప్పటికప్పుడు దాటవేస్తుండడం వారిని ఆవేదనకు గురి చేస్తోంది.  పార్టీ పెద్దలు ఇలాగే వ్యవహరిస్తే తమ దారి తాము చూసుకుంటామని కొందరు కౌన్సిలర్లు బాహాటంగానే ప్రకటిస్తున్నారు.