400 కాదు 200 సీట్లు గెలిచి చూపించండి.. బీజేపీకి సీఎం మమతా బెనర్జీ సవాల్

400 కాదు 200 సీట్లు గెలిచి చూపించండి.. బీజేపీకి సీఎం మమతా బెనర్జీ సవాల్

లోక్‌సభ ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 నియోజకవర్గాల్లోనైనా గెలవాలని సవాల్ విసిరారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో 200కి పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ నాయకులు చెప్పుకున్నారు కానీ, 77 వద్ద ఆగిపోవాల్సి వచ్చిందని మమత విమర్శించారు.  

బెంగాల్‌లో సీఏఏను అమలును అనుమతించబోమని మమతా బెనర్జీ తేల్చిచెప్పారు. సీఏఏ కోసం దరఖాస్తు చేసుకుంటే.. దరఖాస్తుదారులు విదేశీయులుగా మారుతారని, దాని కోసం దరఖాస్తు చేసుకోవద్దని ఆమె ప్రజల్ని హెచ్చరించారు. తృణమూల్ ఎంపీ  మహువా మోయిత్రాకు మద్దతుగా.. కృష్ణానగర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 

మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను అవమానించి లోక్‌సభ నుండి బహిష్కరించారని  మమతా బెనర్జీ మండిపడ్డారు.  ఇక  పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి లేదని స్పష్టం చేసిన ఆమె.. సీపీఐ(ఎం), కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలో బీజేపీ కోసం పని చేస్తున్నాయని ఆరోపించారు.