- కేంద్రాన్ని నిలదీసిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక, డైరీ మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణకు సుమారు రూ.24,850.33 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని వెంటనే విడుదల చేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటులో కోరారు. రాష్ట్ర పశుసంవర్ధక రంగానికి ఊతమిచ్చే కీలక పథకాలకు నిధులు విడుదల చేయడంలో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం లోక్‌సభలో ‘క్వశ్చన్ అవర్’ లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు.
ఈ శాఖకు సంబంధించి కేంద్రం తమ వాటా కింద పలు నిధులు విడుదల చేసినా... ఇంకా రూ. 24, 850.33 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని సభ ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ పశు వ్యాధి నియంత్రణ (ఎన్‌ఏడీసీపీ) రూ.3,880.40 కోట్లు (100% పెండింగ్), పశువ్యాధుల నియంత్రణకు రాష్ట్రాలకు సహాయం (ఏఎస్‌సీఏడీ) రూ.7,421.13 కోట్లు (కేంద్రం వాటా పెండింగ్), జాతీయ పశు సంవర్ధక మిషన్ (ఎన్‌ఎల్ఎం) రూ.12,304,59 కోట్లు (కేంద్రం వాటా పెండింగ్), పశు సంఖ్యా గణన రూ.1,151.61 కోట్లు( కేంద్రం వాటా100% పెండింగ్), ఇంటిగ్రేటెడ్ సాంపిల్ సర్వే స్కీమ్ (92.50 కోట్లు కేంద్ర వాటా పెండింగ్)ఉన్నట్టు సభకు వివరించారు.
