
- పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించడంతోనే బండి సంజయ్ మనస్తాపానికి గురై కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఆదివారం చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఓ పత్రిక ప్రకటలో విమర్శించారు.
పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను బీజేపీ వైపు తిప్పుకుని ఓట్లు పొందేందుకే సంజయ్ పనికి మాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. ప్రజలు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు అనుకుంటున్నారని పేర్కొన్నారు. లిక్కర్‌స్కామ్‌లో కవితను అరెస్ట్చేయకపోవడం తోనే ఎవరు ఏంటనేది ప్రజలకు అర్థమైందని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సరైన రీతిలో పోరాటం చేసి గెలుపొందాలని.. ఇలాంటి పిచ్చి మాటలతో కాదని వివరించారు. ఈ వ్యాఖ్యలను బంద్పెట్టాలని కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.