
మైసూరు లోని చామరాజేంద్ర జూ ప్రవేశ రుసుమును మళ్లీ పెంచారు. ప్రస్తుత ఏడాదిలో ఫీజును పెంచడం ఇది రెండో సారి. జూ నిర్వహణా ఖర్చులు బాగా పెరగడం, సిబ్బంది జీత భత్యాలు అధికం కావడంతో తప్పని పరిస్థితిలో ఎంట్రెన్స్ ఫీజును అదనంగా మరో రూ. 20 పెంచాల్సి వచ్చిందని మైసూరు జూ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజిత్ కులకర్ణి తెలిపారు. ఇకపై వీకెండ్స్ లో, సెలవు రోజుల్లో జూను సందర్శించాలనుకుంటే రూ.100 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో ఇది రూ.80గా ఉంటుందన్నారు. కర్ణాటక మృగాలయ ప్రాధికార పాలనా మండలి సమావేశంలో ఫీజు పెంపుపై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మ్యూజికల్ ఫౌంటెయిన్ ఫీజు, పార్కింగ్ ఫీజు, బ్యాటరీతో నడిచే వాహనాల టికెట్ల ధరల్లో ఎలాంటి మార్పులు ఉండవని అజిత్ కులకర్ణి చెప్పారు. కాగా జూతో పాటు మ్యూజికల్ ఫౌంటైన్‌ను వీకెండ్స్ తో పాటు సెలవు రోజుల్లో చూసేందుకు కాంబో ఆఫర్ కింద రూ. 120 చెల్లించాల్సి ఉంటుంది. మామూలు రోజుల్లో అయితే రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. మైసూరు జూలో ప్రవేశానికి రుసుము పిల్లలకు అయితే మామూలు రోజుల్లో అయితే రూ.40, వారంతపు, సెలవు రోజుల్లో రూ 50గా ఉంటుందని తెలిపారు.