
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జాతీయ క్రీడా పరిపాలన బిల్లు, జాతీయ యాంటీ- డోపింగ్ (సవరణ) బిల్లు లోక్‌సభలో సోమవారం ఆమోదం పొందాయి. సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ బిల్లులను స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత క్రీడల రంగంలో వచ్చిన అతిపెద్ద సంస్కరణలుగా అభివర్ణించారు. ఈ రెండు బిల్లులు దేశంలో క్రీడలను పారదర్శకంగా, జవాబుదారీగా మార్చడానికి ఉద్దేశించినవని తెలిపారు. 2036 ఒలింపిక్స్‌కు బిడ్ చేయాలనే ఇండియా లక్ష్యానికి ఈ బిల్లులు కీలకం అవుతాయని చెప్పారు.
జాతీయ క్రీడా పరిపాలన బిల్లు ప్రకారం ఒక జాతీయ క్రీడా మండలి (ఎన్‌ఎస్బీ) ఏర్పాటు అవుతుంది. ఇది క్రీడా సమాఖ్యలలో జవాబుదారీతనం ఉండేలా చూస్తుంది. ప్రభుత్వ నిధులు పొందాలనుకునే సంస్థలు ఎన్‌ఎబీ గుర్తింపు తప్పనిసరిగా తీసుకోవాలి. క్రీడా సమాఖ్యలు, క్రీడాకారుల మధ్య ఎంపిక, ఎన్నికల వివాదాలను పరిష్కరించడానికి జాతీయ క్రీడా ట్రిబ్యునల్ ఉంటుంది. వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (వాడా) అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని జాతీయ యాంటీ డోపింగ్ బిల్లుకు సవరణ చేశారు. ఇది నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా)కి స్వతంత్రత కల్పిస్తుంది.