గురుకులం ఉప్మాలో ఊసరవెల్లి ?

గురుకులం ఉప్మాలో ఊసరవెల్లి ?
  • హనుమకొండ జిల్లా కరుణాపురంలో ఘటన  
  • కావాలనే వేసి ఉంటారన్న ప్రిన్సిపాల్​

ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురం మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాల, బాలుర కాలేజీలో సోమవారం ఉప్మాలో ఊసరవెల్లి రావడంతో విద్యార్థులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మెనూ ప్రకారం ఉదయం స్టూడెంట్లకు ఉప్మా పెట్టారు. విద్యార్థులు తింటుండగా ఒకరి ప్లేట్​లో ఊసరవెల్లి కనిపించడంతో పడేశారు. 

తర్వాత హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు కారంపొడితో భోజనం పెట్టి తరగతులకు పంపించారు. కాగా, క్లాసులకు హాజరైన కొందరు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో ప్రిన్సిపాల్..​హెల్త్ సూపర్​వైజర్​తో కలిసి వారికి ఓఆర్ఎస్ తాగించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ రుక్సానా ను వివరణ కోరగా ఉప్మాలో ఊసరవెల్లి కనిపించిన మాట నిజమేనని, కానీ ఆ ఊసరవెల్లి ఉప్మాతోపాటు ఉడికినట్టుగా లేదన్నారు. 

అప్పుడే ఎవరో కావాలని తీసుకువచ్చి వేసినట్టుగా ఉందన్నారు. కొన్ని రోజుల కింద క్రమశిక్షణ చర్యల కింద కొందరు స్టూడెంట్లకు టీసీలు ఇచ్చామని, ఇది మనసులో పెట్టుకున్న వారి స్నేహితులే ఇలా చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గత మార్చిలో ఇదే గురుకులంలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే అక్కడికి వచ్చి డిప్యూటీ వార్డెన్‌‌ను సస్పెండ్ చేయించారు.