ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడే అవకాశం

ఏపీకి మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణశాఖ. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఈ వాయుగుండం మరింత బలపడి ఇవాళ బంగాఖాళాతంలో జవాద్  తుఫానుగా మారనుంది. తర్వాత తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని చెప్పారు అధికారులు. దీని ప్రభావంతో 2రోజుల పాటు ఉత్తరాంధ్రలో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా పలుచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు.

తుపాను కారణంగా 95 రైళ్లు రద్దు చేశారు అధికారులు. ఇందులో విజయవాడ మీదుగా వెళ్లే 41 ఎక్స్ ప్రెస్  ట్రైన్స్ క్యాన్సిల్ చేసినట్లు చెప్పారు. మరోవైపు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉత్తరాంధ్ర మూడు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది ఏపీ సర్కార్. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. లోతట్టు, ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉత్తరాంధ్రలో తుపాను సహాయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను ముగ్గురు సీనియర్ అధికారులకు అప్పగించారు.