కారు అద్దెకు తీసుకుని అమృత్సర్లో అమ్మేసిండు.. చందానగర్లో కేటుగాడు అరెస్ట్

కారు అద్దెకు తీసుకుని అమృత్సర్లో అమ్మేసిండు.. చందానగర్లో కేటుగాడు అరెస్ట్

చందానగర్, వెలుగు:  సిటీలో కారును అద్దెకు తీసుకుని ఏకంగా పంజాబ్​లో అమ్మేసిన వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బీహెచ్ఈఎల్ ఎంఐజీకి చెందిన సుమన్ అల్లగిరి తన ఇన్నోవా హైక్రాస్ కారును జూమ్ సెల్ఫ్ డ్రైవ్ యాప్​లో అద్దెకు పెట్టాడు. జనవరి 27న మహ్మద్ నజీర్ అనే వ్యక్తి ఏపీలో పెళ్లి ఉందని చెప్పి ఆ కారును అద్దెకు తీసుకున్నాడు. రోజులు గడిచినా కారును తిరిగి ఇవ్వకపోగా, ఫోన్ చేసినా స్పందించలేదు.

జూమ్ యాప్ నిర్వాహకులు కూడా పట్టించుకోకపోవడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో లొకేషన్ ట్రాకింగ్ ద్వారా కారు పంజాబ్​లోని అమృత్​సర్​లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడు నజీర్​ను అదుపులోకి తీసుకోగా, అప్పటికే కారును రూ. 11.50 లక్షలకు విక్రయించినట్లు తేలింది.

అనంతరం కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు నజీర్​ను రిమాండ్‌‌కు తరలించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూమ్ యాప్ నిర్వాహకులకు కూడా నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.