
- ఆసక్తికరంగా మారిన ఇద్దరు నేతల భేటీ
- ఇప్పటికే ఖమ్మంలో భారీ సభ నిర్వహించిన టీడీపీ చీఫ్
- బీఆర్ఎస్ ఏర్పాటుతో మారుతున్న రాజకీయ చిత్రం
- రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే చాన్స్!
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా మారడంతో తెలంగాణలో ఇతర పార్టీలు తమ యాక్టివిటీని పెంచుతున్నాయి. ఇన్నాళ్లూ ఇక్కడ అంతగా యాక్టివ్‌గా లేని టీడీపీ.. ఇప్పుడు తన కార్యకలాపాల్లో జోరు పెంచింది. జనసేన పార్టీతో కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్నది. ఇప్పటికే చంద్రబాబు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణలో తమ పార్టీకి ఇంకా పట్టు ఉందని చెప్పుకునే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు ఆయన రోడ్ షో కూడా చేపట్టారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పవన్ కల్యాణ్ ఇప్పటికే రాష్ట్రంలోని పలు నియోజకవర్గాలకు కో ఆర్డినేటర్లను నియమించారు. రెండు పార్టీలు కలిసి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీకి రెడీ అవుతున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.
టీడీపీ కేడర్‌కు తోడుగా పవన్ మేనియా కలిస్తే..!
ఏపీ రాజకీయాలు, అక్కడి వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నం.1పై చర్చ పేరుతో చంద్రబాబు, పవన్ ఆదివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఇద్దరు నేతలు దాదాపు మూడు గంటలకుపైగా భేటీ అయ్యారు.
వీరిద్దరి భేటీలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో పాటు తెలంగాణ రాజకీయాలపైనా చర్చ జరిగినట్లు తెలుస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో రెండు పార్టీలకు మంచి ఆదరణ ఉంటుందని చంద్రబాబు, పవన్ అంచనాకు వచ్చినట్టు సమాచారం. టీడీపీకి ఉన్న కేడర్‌కు పవన్ కల్యాణ్ మేనియా కూడా తోడైతే తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా అవతరించవచ్చనే ఆలోచనలో ఇద్దరు నేతలు ఉన్నారు. ఈ ఏడాదే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో అన్ని నియోజకవర్గాలపై వీళ్లు ఫోకస్ పెంచారు. కేసీఆర్ తమ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మార్చుకోవడంతో తెలంగాణవాదాన్ని, ఇక్కడ ఏపీ నేతలకు ఏం పని అని ఎదురు ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయారు. తెలంగాణ వాదాన్ని వదులుకున్న కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకి వస్తే అభ్యంతరం ఏముంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు. కేసీఆర్ ఏపీ రాజకీయాల్లోకివ వచ్చినట్టే తాము తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంటర్ కాబోతున్నట్టు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
తెలంగాణ పాలిటిక్స్‌పై టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు. రాష్ట్రంలో రాజకీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు. ఆదివారం ఈ ఇద్దరు నేతలు హైదరాబాద్‌లో భేటీ కావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పలు చర్చలకు దారితీసింది. టీఆర్ఎస్ పార్టీ పేరును కేసీఆర్ బీఆర్ఎస్‌గా మార్చుకొని దేశమంతా పోటీ చేస్తామనడం,
బీఆర్ఎస్ విస్తరణను ఏపీ నుంచే మొదలుపెట్టడంతో తెలంగాణ రాజకీయాల్లో స్పేస్ క్రియేట్ చేసుకోవడంపై ఈ ఇద్దరు నేతలు దృష్టి సారించారు.
అందివచ్చిన అవకాశం
2014లో టీడీపీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినా.. చివరికి ఇద్దరే మిగిలారు. 2018 ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచినా ఆ తర్వాత ఆ ఇద్దరు గులాబీ గూటికి చేరారు. ఆ మధ్య నాగార్జున సాగర్ బైపోల్, హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పోటీకి దిగినా ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్.రమణ కూడా గులాబీ పార్టీలో చేరారు. టీడీపీ ఇక ఏపీకే పరిమితం అనుకుంటున్న టైంలో కేసీఆర్ బీఆర్ఎస్కు పురుడుపోయడంతో టీడీపీకి రాష్ట్రంలో మళ్లీ అవకాశం దక్కినట్లయింది. ఇలా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలో సొంతంగా పోటీ చేయడం కన్నా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో జట్టుకడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందనే అంచనాకు ఆయన వచ్చినట్లు సమాచారం.