
- సంక్షేమ పథకాలతో మేనిఫెస్టో రూపొందించాలి
- పొలిట్ బ్యూరో మీటింగ్లో టీడీపీ చీఫ్ దిశానిర్దేశం
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని, 40 శాతం సీట్లు కేటాయిస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ లో ఆయన అధ్యక్షతన పొలిట్ బ్యూరో మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 3 గంటల పాటు 17 అంశాలపై నేతలు చర్చించారు. ఏపీకి చెందిన 13, తెలంగాణకు చెందిన 4 అంశాలపై కీలక నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.
వచ్చే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ఎలాంటి ఎజెండాతో ముందుకెళ్లాలి? మేనిఫెస్టో ఎలా ఉండాలి? అనే దానిపై చర్చించారు. మేనిఫెస్టో తయారీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. ‘‘సంక్షేమ పథకాలకు పునాది వేసిందే టీడీపీ. పేదలకు ఇప్పుడు అందుతున్న పథకాలన్నీ టీడీపీ రూపొందించినవే. వీటి కంటే రెట్టింపు సంక్షేమ పథకాలతో కొత్త మేనిఫెస్టో ఉండాలి.
బడుగు, బలహీన వర్గాలతో పాటు యువతపై దృష్టిసారించాలి. పార్టీలో కష్టపడే ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించాలి” అని దిశా నిర్దేశం చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఈ నెల 30 నుంచి మే 28 వరకు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా దేశవిదేశాల్లో వంద సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. మహానాడు ఏర్పాట్లకు కమిటీ, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నరు: అచ్చెన్నాయుడు
ఏపీ సీఎం జగన్ ఆంధ్రాను అమ్మేస్తున్నారని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీలో స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 వెండి నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు.
పొత్తులుండవ్: కాసాని
పొలిట్ బ్యూరో మీటింగ్ అనంతరం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని తెలిపారు. ‘ఇంటింటికీ టీడీపీ’ పేరుతో గడపగడపకు వెళ్తున్నామని చెప్పారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ధరణి తదితర ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయంతో రాష్ట్ర క్యాడర్ లోనూ జోష్ వచ్చిందన్నారు.