
ఏపీ స్కిల్ స్కాం కేసులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను రేపటికి (సెప్టెంబర్ 26) వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు.చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏ పిటిషన్ పై విచారణ జరపాలనే దానిపై చంద్రబాబు లాయర్లు, సీఐడీ తరపు లాయర్ల మధ్య వాదోపవాదనలు జరిగాయి.
కస్టడీ పిటిషన్ కంటే బెయిల్ పిటిషన్ పై విచారణ జరపాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. అయితే ఈ సమయంలో ఏ పిటిషన్ పై విచారణ జరపాలో తమకు తెలుసునని ఏసీబీ కోర్టు జడ్జి చెప్పారు. ఈ సమయంలో చంద్రబాబు తరపు న్యాయవాదులపై ఏసీబీ కోర్టు జడ్జి అసహనం వ్యక్తం చేశారు. ఏ పిటిషన్ ఎప్పుడు విచారించాలో తమకు తెలుసని వాఖ్యానించింది. బెయిల్ పిటిషన్ పై విచారించాలని కోర్టుపై ఒత్తిడి చేయొద్దన్న ఎసీబీ కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై విచారించడానికి కోర్టు సిద్ధంగా ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు ఆర్డర్స్ ఇస్తుందని న్యాయమూర్తి తెలిపింది. కస్టడి పిటిషన్ పై సీఐడీ వేసిన మెమోపై కోర్టు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరగా.. మెమో ఇంకా తమ దగ్గరకు రాకుండానే నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు మీరెలా చెబుతారని ఏసీబీ కోర్టు సీరియస్ అయ్యింది. మీకు ఇలా చేయటం అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ నెల 14వ తేదీన చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను వేసినట్టుగా చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. చంద్రబాబును ఇప్పటికే రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి తీసుకుందని చంద్రబాబు తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. సీఐడీ కస్టడీ అవసరం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలను సమర్ధించుకుంటూ వాదనలు వినిపించారు. దీంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్లపై రేపు(సెప్టెంబర్ 26) విచారణ నిర్వహిస్తామని ఏసీబీ కోర్టు జడ్జి ప్రకటించారు.