చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి... తీర్పు సెప్టెంబర్ 21కి వాయిదా

చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి... తీర్పు సెప్టెంబర్ 21కి వాయిదా

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు ముగిశాయి.  తీర్పును రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు రేపు ( సెప్టెంబర్ 21) ఉదయం తీర్పు వెల్లడించనుంది.  విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ కస్టడీ పిటిషన్లపై సుమారు మూడు గంటలకు పైగా  వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అటు చంద్రబాబు నాయుడు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈనెల 21(గురువారం) ఉదయం 11:30 గంటలకు తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో రేపు ఏం తీర్పు ఇవ్వనున్నారనే ఉత్కంఠ నెలకొంది.

సీఐడీ వాదనలు...

స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేశారు అని సీఐడీ తరపు న్యాయవాది పొన్నవోలు  వాదించారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న ప్రతీ ఒక్కరినీ మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో వాదించారు. చంద్రబాబు నాయుడుని పూర్తి స్థాయిలో విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అని స్పష్టం చేశారు.. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉంది అని అన్నారు. చంద్రబాబు నాయుడును కస్టడీకి ఇవ్వడం వల్ల ఎవరికీ, ఎలాంటి నష్టం ఉండదు అని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు


సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌  వాదనలు ఇలా...

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు సిద్ధార్థ్‌ లూథ్రా, సిద్ధార్థ్‌ అగర్వాల్‌లు వాదనలు వినిపించారు. స్కిల్ డవలప్‌మెంట్‌లో స్కామ్ జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు అవినీతి చేసినటల్లు ఆధారాలు లేవు అని చెప్పుకొచ్చారు. అరెస్టు ప్రక్రియ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అని వాదించారు. యన్.యస్.జి భద్రత ఉన్న వ్యక్తి ని రెండు రోజులు విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారు అని లూథ్రా వాదించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కస్టడీ కోరుతున్నారు..ప్రస్తుతం పోలీసు కస్టడీ అవసరం లేదు అని వాదనలు వినిపించారు. నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధులు దుర్వినియోగం పేరే చెబుతున్నారని సిద్ధార్థ లూథ్రా వాదించారు.

చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబరు 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబరు 11న కస్టడీకి కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారు. కొన్ని గంటలపాటు చంద్రబాబును విచారించారు. ఆయన్నుంచి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి, మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని సిద్ధార్థ లూథ్రా, అగర్వాల్‌లు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించారు. మరి రేపు (సెప్టెంబర్ 21) కోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో వేచి చూడాలి. . . .