
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఖబడ్దార్.. నీ ఆటలు సాగవని హెచ్చరించారు. పులివెందులలో ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ప్రధాని మోదీని ఢిల్లీ నుంచి గుజరాత్‌కి పంపించాలని పిలుపునిచ్చారు. లోటస్‌పాండ్‌కు వెళ్లకపోతే వైసీపీ అధినేత నేత జగన్‌కి నిద్రపట్టదని ఎద్దేవాచేశారు. నేరగాళ్లకు, ద్రోహులకు, అబద్ధాలు చెప్పే వాళ్లకు.. కుట్రలు చేసేవాళ్లకు పరిపాలించే హక్కు లేదని మహాభారతం చెబుతోందని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు. ప్రాంతీయ అభిమానంతోనో.. కులాభిమానంతో జగన్‌కు ఓటేస్తే కేసీఆర్‌కు అధికారం ఇచ్చినట్లే అని చెప్పారు. జగన్ తన లాభం కోసం ఆత్మాభిమానాన్ని కేసీఆర్‌కు తాకట్టుపెట్టారని, ఇదేనా మన రోషం..పౌరుషం అని ప్రశ్నించారు. 60 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న హైదరాబాద్ మనకు కాకుండా పోయిందని, మన ఆస్తుల్ని, కష్టాన్ని దోచుకున్న కేసీఆర్‌కి ఊడిగం చేస్తామా అని మరోసారి ప్రశ్నించారు.నమ్మించి మోసం చేసిన మోదీకి జగన్ దాసోహం అయ్యాడని మండిపడ్డారు. కడప జిల్లాను అభివృద్ధి చెందిన జిల్లాగా చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.
జగన్ నోరువిప్పితే అబద్ధాలు తప్ప నిజం బయటికి రాదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ముద్దనూరు, ఆర్టీపీపీని మూసివేస్తామనే అసత్య ప్రచారాలు చేశారని, వైసీపీ అబద్ధాలను నమ్మవద్దని బాబు విజ్ఞప్తి చేశారు. బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో భూములు కొట్టేసి వేల కోట్లు దోచుకున్న చరిత్ర జగన్‌ది అని ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పేరుతో ఐరన్ ఓర్ అమ్ముకున్నారని, వేలకోట్లు దోచుకున్న చరిత్ర జగన్‌దని విమర్శించారు. తమ హయాంలో రాయలసీమ స్టీల్‌ప్లాంట్‌కు ఫౌండేషన్ వేసి చరిత్ర సృష్టించామని బాబు తెలిపారు.