- ఏపీ మూడో ముఖ్యమంత్రిగా బాధ్యతల స్వీకరణ
- మరో నాలుగు కీలక అంశాలపై సంతకాలు
హైదరాబాద్, వెలుగు: ఏపీ మూడో సీఎంగా చంద్రబాబు నాయుడు గురువారం బాధ్యతలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని, విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకొని సాయంత్రం 4.41 గంటలకు సెక్రటేరియెట్ లోని మొదటి బ్లాక్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజధాని రైతులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో పాటు మంత్రులు అచ్చెన్నాయుడు, రామానాయుడుతో పాటు పలువురు మంత్రులు, సెక్రటేరియెట్ సిబ్బంది చంద్రబాబుకు వెల్ కమ్ చెప్పారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలిపారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై రైతుల సమక్షంలో రెండో సంతకం చేశారు. సామాజిక పెన్షన్లు రూ.4 వేలకు పెంపు ఫైల్ పై మూడో సంతకం, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సైన్సెస్ ఫైల్‌పై విద్యార్థుల సమక్షంలో ఐదో సంతకాన్ని చేశారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవని ఎన్నికల ప్రచార సమయంలో యువత పెద్ద ఎత్తున తమ ఆవేదన నా దృష్టికి తీసుకువచ్చారు. గత ప్రభుత్వంలో డీఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు.. ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. పరిశ్రమలు రాకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు. దేశంలోనే ఎక్కువగా మన రాష్ట్రంలో 24 శాతం నిరుద్యోగ రేటు ఉంది. దీంతో నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని ఉద్యోగాలు కల్పించాలని నేను, పవన్ కల్యాణ్, బీజేపీ ఎన్నికల ప్రచారంలో ప్రకటించాం. దాన్ని అమలు చేస్తున్నం” అని అన్నారు. రాష్ట్రంలో ఇక నుంచి ప్రజాపాలన అందిస్తామని చెప్పారు.