
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ కేసులో.. సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 17న విచారణ జరిగింది. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 20కి వాయిదా వేసింది. చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. కోర్టులో 17A పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన అన్ని పత్రాలను తమ ముందు ఉంచాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.
తొలుత హరీశ్ స్వాలే వాదనలు వినిపిస్తూ రాజకీయ ప్రతీకారం కోసమే సెక్షన్ 17ఏ తీసుకొచ్చారని చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదించారు. ఈ కేసులో ఆ సెక్షన్ వర్తిస్తుందా? లేదా? అన్నదే ప్రధానమని.. ఆరోపణలు ఎప్పటివనేది కాదని.. కేసు నమోదు, విచారణ ఎప్పుడన్నదే చర్చించాల్సిన అంశమని చెప్పారు.
హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారని చంద్రబాబు తరఫు లాయర్ లూథ్రా వాదించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించిందని.. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు.. అధికార విధుల్లో భాగంగా ఇచ్చినవే అన్నారని.. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయన్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17A వర్తిస్తుందని.. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదన్నారు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యమని.. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు అన్నింటికీ 17A వర్తిస్తుంది అన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైందని.. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా... కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయి అన్నారు.
సీఐడీ తరఫున ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. ఈ కేసు దర్యాప్తు 2017 కంటే ముందే మొదలైందని.. అప్పుడే దీన్ని CBI పరిశీలించిందన్నారు. ఇక రాజకీయ కక్ష అని ఎలా అంటారని.. తప్పు చేసింది 2015-16లో అన్నారు. దర్యాప్తు మొదలయింది ఈ ప్రభుత్వం రాకముందేనని.. ఇప్పుడు దాన్ని కక్ష అని ఎలా అంటారంటూ కొన్ని డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు APSDCని ప్రారంభించారని.. కేవలం 10% ప్రభుత్వం ఇస్తే చాలన్నారు. 90% మరో సంస్థ గిఫ్ట్‌గా ఇస్తుందన్నారన్నారు. ఆ వెంటనే 10% నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదలయ్యాయన్నారు. ఇరు వాదనలు విన్న సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను శుక్రవారం అక్టోబర్ 20కి వాయిదా వేసింది.