
ప్రధాని మోడీతో ముందే గొడవ పడితే చాలా నష్టపోయేవాళ్లమని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ ఓపికగా ఎదురు చూసినా నిర్లక్ష్యం చేశారనే నింద మోదీకే వచ్చిందన్నారు. సరైన సమయంలోనే ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని అన్నారు. రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో మాట్లాడిన చంద్రబాబు.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలని.. టీడీపీకి నష్టం చేయాలని మోడీ చేయని ప్రయత్నం లేదన్నారు. ఏదో ఒక విధంగా టీడీపీని నష్టపర్చాలనేదే బీజేపీ ధ్యేయం అని అన్నారు. కేసీఆర్ కూడా టీడీపీకి నష్టం చేయాలని అనేక ప్రయత్నాలు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కుట్రలకు మోడీ, కేసీఆర్ కుతంత్రాలు తోడయ్యాయని అన్నారు. ఎందరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని అన్నారు. కార్యకర్తలతో మమేకం కావడం,అభిప్రాయాలు సేకరించడం,కలిసికట్టుగా పనిచేయడం టీడీపీకే సాధ్యమని.. టీడీపీ లాంటి పార్టీ దేశంలో ఎక్కడా లేదన్నారు చంద్రబాబు.