ధనూర ప్రైమరీ స్కూల్ లో .. స్టూడెంట్​ను చితకబాదిన టీచర్

ధనూర ప్రైమరీ స్కూల్ లో .. స్టూడెంట్​ను చితకబాదిన టీచర్
  • కాలు విరగడంతో వెలుగులోకి ఘటన 

టేక్మాల్, వెలుగు: రెండో తరగతి చదువుతున్న స్టూడెంట్ ను టీచర్ విచక్షణ రహితంగా చితక బాదిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుల కథనం ప్రకారం..  మండలంలోని ధనూర ప్రైమరీ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తున్న చంద్రప్రకాశ్ రెండు నెలల క్రితం  రెండో తరగతి చదువుతున్న మనోహర్ ను చితక బాదాడు. దీంతో అతడి కాలు నరానికి దెబ్బ తగిలింది. అది ఇన్ఫెక్షన్  కావడంతో చికిత్స కోసం సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​ తరలించారు.

ఈ విషయం తెలిసి సదరు టీచర్ హాస్పిటల్ ఖర్చుల కోసం రూ.10 వేలు ఇచ్చాడు. స్టూడెంట్ కు పూర్తిగా నయం అయ్యేవరకు ఖర్చులు భరిస్తానని భరోసా ఇచ్చాడు.  కాగా స్టూడెంట్​కు కాలు విరిగిందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి హైదరాబాద్ లోని  ఓ ప్రైవేట్ హాస్పిటల్​ తరలించారు. రెండు నెలలుగా చికిత్స చేసినప్పటికీ వైద్యులు కాలు సరికాదని చెప్పడంతో కుటుంబ సభ్యులు సోమవారం టేక్మాల్​ పోలీసులను అశ్రాయించారు. పోలీసులు ఆ టీచర్ ను పిలిపించగా అతడికి అండగా టీచర్​యూనియన్స్ రావడం గమనార్హం.

మభ్య పెట్టిన టీచర్

ఆస్పత్రి పాలైన స్టూడెంట్​కు పూర్తి ఖర్చు భరిస్తానని చెప్పిన టీచర్ తర్వాత  చేతులెత్తేశాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ట్రీట్మెంట్ కోసం పలు హాస్పిటల్స్​లో రూ.8 లక్షల వరకు ఖర్చయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ విషయం ఆ టీచర్ కు చెప్పగా తాను డబ్బులు ఇవ్వనని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. స్టూడెంట్​ను చితకబాదిన టీచర్ కు ఓ టీచర్స్ యూనియన్  నాయకులు వత్తాసు పలికారు. పీఎస్​ కు వచ్చి సారు కొడితే ఆ స్టూడెంట్​కాలు విరగలేదని వాదించారు. ఇచ్చినన్ని తీస్కొండి, లేదంటే కేసు పెట్టుకోండి అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.