యాక్సిడెంట్ తప్పించేందుకు చంద్రయాన్ 2 రూటు మార్చిన్రు

యాక్సిడెంట్ తప్పించేందుకు చంద్రయాన్ 2 రూటు మార్చిన్రు

బెంగళూరు: ఇండియాకు చెందిన స్పేస్​క్రాఫ్ట్​ చంద్రయాన్ ​2, నాసాకు చెందిన లూనార్​ రీకనైసెన్స్​ఆర్బిటర్​(ఎల్​ఆర్​వో) ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి బయటపడ్డాయి. ఇందుకోసం ఇస్రో.. చంద్రయాన్​ 2 కక్ష్య మార్చి వేరే కక్ష్యలోకి పంపింది. ఒకవేళ ఈ రెండు స్పేస్​క్రాఫ్టులు ఢీకొట్టుకొని ఉంటే ఇస్రో, నాసాలకు భారీ నష్టం జరిగేది. చంద్రుడి కక్ష్య స్పేస్​జంక్​తో నిండిపోయి ఉండేది.

అసలేం జరిగిందంటే..

చంద్రయాన్-2, నాసా ఎల్ఆర్‌‌‌‌వో  రెండూ చంద్రుని ధ్రువ కక్ష్యలో తిరుగుతుంటాయి. చంద్రుడి ధ్రువాల మీద ఈ రెండూ దగ్గరగా వస్తుంటాయి. అక్టోబర్ ​20న చంద్రుని ఉత్తర ధృవం దగ్గర చాలా దగ్గరకు వస్తాయని గుర్తించినట్టు ఇస్రో తెలిపింది. ఆ సమయంలో రెండింటి మధ్య రేడియల్​విభజన దూరం 100 మీటర్లే ఉంటుందని, రెండూ అత్యంత దగ్గరగా చేరుకునే దూరం 3 కిలోమీటర్లే ఉంటుందని వివరించింది. దీంతో నాసాతో చర్చించి చంద్రయాన్​2, ఎల్​ఆర్​వో ఢీకొట్టుకోకుండా ఉండేందుకు కక్ష్య మార్చాలని నిర్ణయించామంది. అక్టోబర్​ 18న దీన్ని షెడ్యూల్ చేసి అదేరోజు రాత్రి 8.22 గంటలకు ప్రాసెస్​ను అమలు చేశామని వివరించింది. దీంతో చంద్రయాన్​ 2 మరో కక్ష్యలోకి వెళ్లిందని, మున్ముందు కూడా రెండు స్పేస్​క్రాఫ్ట్​లు ఢీకొనే అవకాశంలేదని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. ఎర్త్​ ఆర్బిట్​లోని శాటిలైట్లు ఇలా దగ్గరగా రావడం సాధారణమేనని సైంటిస్టులు చెప్పారు.