- జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డితోపాటు మరో ఇద్దరు కూడా అరెస్ట్
- నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు
- ఆదిలాబాద్ జైలుకు తరలించిన పోలీసులు
- పరారీలో మరో ఐదుగురు నిందితులు
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో మంత్రి వివేక్,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కాన్వాయ్‌పై రాళ్లదాడి కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయనతోపాటు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, చెన్నూరుకు చెందిన దోమకొండ అనిల్, రామకృష్ణాపూర్‌కు చెందిన రాగిడి లక్ష్మీకాంత్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరచగా.. మార్చి 3 వరకు (14 రోజులు) రిమాండ్ విధించారు.ఈ మేరకు సుమన్‌తోపాటు మిగతా ముగ్గురిని పోలీసు బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.
మంగళవారం క్యాతనపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికల సందర్భంగా ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై బాల్క సుమన్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. సుమన్ సైతం మంత్రి వెహికల్‌పై ట్రాఫిక్ కోన్ విసిరి హల్‌చల్ చేశారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ రాకేశ్, కోటపల్లి ఎస్సై రాజశేఖర్, కాంగ్రెస్ కార్యకర్తలు జావిద్, తోకల సురేశ్‌యాదవ్ తీవ్రంగాగాయపడ్డారు.
మరికొందరికి కూడా గాయాలయ్యాయి. మంత్రి వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. బందోబస్తు విధులకు ఆటంకం కలిగించడం,రాళ్లతో దాడికి పాల్పడి కానిస్టేబుల్ రాకేశ్,ఎస్సై రాజశేఖర్‌కు గాయాలయ్యేందుకు కారణమైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , మూల రాజిరెడ్డి, గొడిసెల రాజారమేశ్, గాజుల చంద్రకిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్‌రెడ్డితోపాటు పలువురిపై కాసీపేట ఎస్‌హెచ్‌వో గంగారం ఫిర్యాదు చేశారు. మంత్రి వెహికల్ అద్దాలు ధ్వంసం చేసిన ఘటనపై కాంగ్రెస్ లీడర్ గోపు రాజం మరో కంప్లైంట్. ఈ మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు సీఆర్ నెంబర్40/2026 బీఎన్ఎస్ సెక్షన్లు 189(3),191(2),191(3),121(2),223 ఆర్/డబ్ల్యూ 190, సీఆర్ నెంబర్41/2026, బీఎన్ఎస్ సెక్షన్లు 189(3),191(2),191(3),118(1),324(5),223 ఆర్/డబ్ల్యూ 190 కింద కేసులు నమోదు చేశారు. దాడిలో తీవ్రగాయాలైన కానిస్టేబుల్రాకేశ్ను అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.
బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన
రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదు కావడంతో బుధవారం సాయంత్రం బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో మందమర్రి సీఐ పర్స రమేశ్, పోలీసులు.. క్యాతనపల్లి మారుతీనగర్‌లోని ఉన్న సుమన్ ఇంటికి అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ పెద్దసంఖ్యలో గుమిగూడిన బీఆర్‌ఎస్ శ్రేణులు పోలీసులను ప్రతిఘటిస్తూ.. వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు.
అనంతరం సుమన్‌తోపాటు మూల రాజిరెడ్డి, దోమకొండ అనిల్, రామిడి లక్ష్మీకాంత్‌ను అదుపులోకి తీసుకొని.. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత కోర్టులో మంచిర్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా సుమన్ తరఫు లాయర్లు బెయిల్ కోరుతూ తమ వాదనలు వినిపించారు. అయితే జడ్జి వాటిని పరిగణనలోకి తీసుకోలేదు. 14 రోజుల రిమాండ్ విధించగా.. సుమన్‌తోపాటు మిగితా ముగ్గురిని రాత్రి ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. ఈ సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు వద్ద బీఆర్‌ఎస్ కార్యకర్తలు నానా హంగామా చేస్తూ.. పోలీసుల విధులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు ప్రకాశ్, రవికుమార్ పర్యవేక్షణలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. రెండు కేసులకు సంబంధించి మిగితా నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నామని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని రామకృష్ణాపూర్ ఎస్సై శ్రీధర్ తెలిపారు.
