
- చంద్రయాన్-3లో హైదరాబాద్ కంపెనీ
- బాహుబలి రాకెట్‌కు ఫ్యూయెల్ లైన్స్‌ను సరఫరా చేసిన సీఎన్సీ టెక్నిక్స్
- అత్యంత కీలకమైన క్రయోజెనిక్ స్టేజ్ ఇంధన సరఫరా కోసం టెక్నాలజీ
- నాన్ మెటల్ ఫైబర్ గ్లాస్‌తో ఫ్యూయెల్ లైన్స్
- 2007 నుంచి ఇస్రో ప్రయోగాల్లో భాగస్వామ్యం
- 2017లో 104 శాటిలైట్లతో ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ37 లోనూ సీఎన్సీ పాత్ర
చంద్రయాన్-3 ప్రయోగానికి అత్యంత కీలకమైన కాంపోనెంట్లను మన హైదరాబాద్ కంపెనీ సీఎన్సీ టెక్నిక్స్ అందించింది. ఇంజన్‌కు ఇంధనాన్ని సరఫరా చేసేందుకు ఫైబర్‌గ్లాస్ పైపులను అందించింది.
హైదరాబాద్, వెలుగు: ఇప్పుడు ఏనోట విన్నా చంద్రయాన్3 సక్సెస్ గురించే. ఏ దేశమూ చేరలేని చంద్రుడి దక్షిణ ధ్రువాన్ని చేరి మన చంద్రయాన్ అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది. అయితే, ఆ ప్రయోగానికి అత్యంత కీలకమైన కాంపోనెంట్లను అందించింది మన హైదరాబాద్ కంపెనీ అని ఎవరికీ తెలిసి ఉండదు. అవును, రాకెట్ గాల్లోకి దూసుకెళ్లాలంటే ఇంజన్, ఇంధనం ఎంత ముఖ్యమో.. ఆ ఇంజన్‌కు ఇంధనాన్ని సరఫరా చేసే ఫ్యూయెల్ లైన్స్ (పైపులు) కూడా అంతే కీలకం. ఆ ఫ్యూయెల్ లైన్స్‌ను సరఫరా చేసింది హైదరాబాద్‌కు చెందిన ‘సీఎన్సీ టెక్నిక్స్’ అనే సంస్థ. అది కూడా జీఎస్ఎల్వీ బాహుబలి రాకెట్లో అత్యంత కీలకమైన క్రయోజెనిక్ స్టేజ్(థర్డ్ స్టేజ్)కు కావడం విశేషం. ఈ సక్సెస్‌లో భాగమై తెలంగాణ పేరునూ అంతరిక్ష రంగంలో లిఖించేలా చేసింది సీఎన్సీ టెక్నిక్స్. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది గగన్‌యాన్ ప్రాజెక్టులోనూ సంస్థ భాగస్వామ్యం కానుంది.
కొత్త టెక్నిక్‌తో ఫ్యూయెల్ లైన్స్
క్రయోజెనిక్ స్టేజ్‌లో ఇంధనం మైనస్ 270 డిగ్రీల అత్యంత చల్లని స్థితిలో ఉంటుంది. లిక్విఫైడ్ హైడ్రోజన్, లిక్విఫైడ్ ఆక్సిజన్‌ను ఇంధనంగా వాడుతుంటారు. అలాంటి చల్లటి ఇంధనాన్ని ఇంజిన్‌ను మండించే చాంబర్‌కు పంపడం సవాల్‌తో కూడుకున్నదే. అందుకే అత్యంత పటిష్టమైన టైటానియం పైపులను వాడుతుంటారు. అయితే, ఇక్కడే సీఎన్సీ టెక్నిక్స్ కొంచెం కొత్త టెక్నాలజీని పరిచయం చేసింది. టైటానియంతో కాకుండా ఫైబర్ గ్లాస్ టెక్నిక్‌తో తయారు చేసిన ఫ్యూయెల్ లైన్స్‌ను చంద్రయాన్3 బాహుబలి రాకెట్లో వాడారు. కాగా, చంద్రయాన్3తో పాటు ఇస్రో చేపట్టే మిగతా ప్రయోగాలకూ సీఎన్సీ టెక్నిక్స్ ఫ్యూయెల్ లైన్స్‌ను సరఫరా చేస్తున్నది.
ఇస్రో గెలుపు గుర్రం పీఎస్ఎల్వీ రాకెట్‌లోనూ సీఎన్సీ ఫ్యూయెల్ లైన్స్‌ను వాడుతున్నారు. 2017లో ఇస్రో 104 శాటిలైట్లతో దిగ్విజయంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ37 ప్రయోగంలోనూ సంస్థ ఫ్యూయల్ లైన్స్ ఉన్నాయి. తొలిసారి 2007లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ)తో ఒప్పందం కుదిరిందని సంస్థ డైరెక్టర్లు రాహుల్ బండారు, రోహిత్ బండారు తెలిపారు. వచ్చే ఏడాదిలో ఇస్రో చేయనున్న మరో ప్రతిష్టాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం కూడా కాంపోనెంట్స్‌ను తయారు చేస్తున్నట్టు చెప్పారు. నాలుగేండ్ల నుంచి ఆ కాంపోనెంట్స్కోసం ఆర్ అండ్ డీపై వర్క్ చేస్తున్నట్టు పేర్కొన్నారు..
స్తంభాలు కొంచెం కొత్తగా.. గట్టిగా
రోడ్డు మధ్యల డివైడర్ లేదా రోడ్డు పక్కన, మన వీధుల్లో ఇప్పటిదాకా కాంక్రీట్ లేదా స్టీల్‌తో చేసిన స్తంభాలను మాత్రమే చూసి ఉంటాం. సిమెంట్ స్తంభాలు పెద్ద గాలి వస్తే నేలకొరిగిపోతాయి.. ఇనుప స్తంభాలతో ఒక్కోసారి కరెంట్ షాక్ కూడా కొట్టే ప్రమాదముంది. దానికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ గ్లాస్‌తో
‘హెలిపోల్’ అనే టెక్నాలజీని సంస్థ తీసుకొచ్చింది. సీఎన్సీ వైండింగ్ మెషీన్ టెక్నిక్‌తోనే వీటినీ తయారు చేసినట్టు రాహుల్, రోహిత్ తెలిపారు. ప్రస్తుతం వీటిని వైజాగ్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, కొన్ని ఎయిర్‌పోర్టుల్లో ఏర్పాటు చేశామన్నారు. వాటిపై ట్రయల్స్ నడుస్తున్నాయని చెప్పారు. తుఫాన్లు వచ్చినా ఈ హెలిపోల్స్ కూలవని తెలిపారు. అంతేగాకుండా.. కార్లు, ఆటోల్లో వాడే సీఎన్జీ గ్యాస్ సిలిండర్లనూ లైట్‌వెయిట్ కార్బన్ ఫైబర్, ప్రెజర్ వెజెల్స్తో తయారు చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గ్రీన్ హైడ్రోజన్ ఇంధన స్టోరేజీ కోసం వీటిని సిద్ధం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం వీటి కోసం ఆర్ అండ్ డీ కొనసాగుతున్నదని తెలిపారు.
అన్నదమ్ములు కలిసి..
రాహుల్ బండారు 2005లో కంపెనీ డైరెక్టర్‌గా చేరారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్లస్2 వరకు చదివిన ఆయన.. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ఒహాయో యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. తర్వాత 2005లో ఇండియాకు తిరిగొచ్చి తన తండ్రి స్థాపించిన సంస్థలో డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఇస్రో, వీఎస్సీసీతో కాంట్రాక్టుల బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. ఆయన తమ్ముడు రోహిత్ బండారు 2008లో డైరెక్టర్‌గా వచ్చారు. ఆయన కూడా హెచ్‌పీఎస్‌లోనే తన స్కూలింగ్ను పూర్తి చేశారు. గోకరాజు రంగరాజు కాలేజీలో బయోమెడికల్ ఇంజినీరింగ్‌ను పూర్తి చేశారు. తన తండ్రి స్థాపించిన కాంపోజిట్స్ ఇండస్ట్రీపై ఇష్టం ఏర్పడి ఈ రంగంలోకి వచ్చారు.
1987లో మొదలై..
సీఎన్సీ టెక్నిక్స్ సంస్థను 1987లో బండారు విజయ్ కృష్ణ స్థాపించారు. కేవలం ముగ్గురు టెక్నోక్రాట్లతో ప్రారంభమైన సంస్థ.. స్పేస్ టెక్నాలజీతో పాటు సివిల్, డిఫెన్స్ టెక్నాల జీలనూ అందించే స్థాయికి ఎదిగింది. మల్టీ యాక్సెస్ సీఎన్సీ ఫిలమెంట్ వైండింగ్ మెషీన్స్ తయారీలో అగ్రగామిగా నిలిచింది సంస్థ. 2000వ సంవత్సరంలో డీఆర్ డీఎల్ కోసం తొలి ఫిలమెంట్ వైండింగ్ మెషీన్‌ను తయారు చేసింది.
అప్పటి సైంటిఫిక్ అడ్వైజర్‌గా ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా దానిని ప్రారంభించారు. ఈ 23 ఏండ్లలో 280 మెషీన్లను తయారు చేశామని రాహుల్, రోహిత్ తెలిపారు. వాటిని అమెరికా, బ్రిటన్, స్వీడన్, జర్మనీ, అర్జెంటీనా, కెనడా, ఆస్ట్రేలియా సహా 30 దేశాలకు ఎగుమతి చేసినట్టు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఏరోస్పేస్, రక్షణ రంగ సంస్థలతో కలిసి పనిచేస్తున్నామన్నారు.