చంద్రయాన్​-3 ... చంద్రుడి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్

చంద్రయాన్​-3 ... చంద్రుడి ఫొటోలు పంపిన  విక్రమ్ ల్యాండర్

చందమామ చుట్టూ తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్  కొన్ని ఫొటోలు, వీడియోలను పంపించింది.  మూన్​కు దూరంగా, చిన్న సైజులో భూమి కూడా ఆ వీడియోల్లో కనిపించింది. వీటిలో ఒక వీడియో పంద్రాగస్టు రోజున ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోక ముందు తీసినదని ఇస్రో తెలిపింది. మరోటి గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత తీసిన వీడియో అని పేర్కొంది. ఇక విక్రమ్ ల్యాండర్ కు శుక్రవారం తొలి డీబూస్టింగ్ (కక్ష్య తగ్గింపు) ప్రక్రియ విజయవంతం అయిందని ఇస్రో వెల్లడించింది.  ఆదివారం మధ్యాహ్నం మరోసారి కక్ష్య  తగ్గించి 23న లేదా 24న చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తామని ఇస్రో తెలిపింది.

బెంగళూరు:  చందమామ చుట్టూ తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్ మూన్ తాజా ఫొటోలను క్లిక్ మనిపించింది. చంద్రుడు.. దాని వెనక బ్యాక్ గ్రౌండ్​లో భూమి చిన్నగా కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శుక్రవారం విడుదల చేసింది. వీటిలో ఒక వీడియో పంద్రాగస్టు రోజున ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోక ముందు విక్రమ్ ల్యాండర్ తన ‘ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్ కెమెరా(ఎల్పీడీసీ)’తో తీసినదని ఇస్రో తెలిపింది. మరోటి గురువారం ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విడిపోయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ తన ‘ల్యాండర్ ఇమేజర్(ఎల్ఐ) కెమెరా1’తో తీసిన వీడియో అని పేర్కొంది. మొదటి వీడియోలో చంద్రుడిపై ఫాబ్రి, జియోర్డానో బ్రూనో, హర్ఖేబీ జే క్రేటర్లు స్పష్టంగా కన్పిస్తుండగా, రెండో వీడియోలో చంద్రుడి వెనక భూమి చిన్నగా కనిపిస్తోంది. కొద్దిదూరంలో మెరుస్తూ కన్పిస్తున్న ప్రొపల్షన్ మాడ్యూల్​ను కూడా ల్యాండర్ క్లిక్ మనిపించింది. మొదటి వీడియోలో కన్పిస్తున్న దక్షిణ ధ్రువంపై డార్క్ సైడ్​లోనే విక్రమ్ ల్యాండర్ ఈ నెల 23న దిగనుందని ఇస్రో వెల్లడించింది. 

లూనా 25 కూడా..

రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ పంపిన లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ కూడా చంద్రుడి ఫొటోను క్లిక్ మనిపించింది. చంద్రుడి వెనక వైపు ఉండే జీమన్ క్రేటర్ ను లూనా 25 తన ఎస్టీఎస్ ఎల్ కాంప్లెక్స్ కెమెరాతో ఫొటో తీసి పంపిందని రాస్ కాస్మోస్ గురువారం వెల్లడించింది. లూనా 25 ల్యాండర్ ఈ నెల 21 నుంచి 23 మధ్య చంద్రుడిపై ల్యాండ్ కానుంది. 

113 x 157 కి.మీ. కక్ష్యలోకి ల్యాండర్ 


విక్రమ్ ల్యాండర్​కు శుక్రవారం తొలి డీబూస్టింగ్ (కక్ష్య తగ్గింపు) ప్రక్రియ విజయవంతం అయిందని ఇస్రో వెల్లడించింది. డీబూస్టింగ్ ద్వారా చంద్రుడి చుట్టూ 157 x 167 కి.మీ. కక్ష్యలో నుంచి 113 x 157 కి.మీ. కక్ష్యలోకి ల్యాండర్ దిగిందని పేర్కొంది. విక్రమ్ ల్యాండర్ పూర్తి నార్మల్ గా పని చేస్తోందని తెలిపింది. ఆదివారం మధ్యాహ్నం మరోసారి ల్యాండర్ కు డీబూస్టింగ్ ప్రక్రియ నిర్వహించి, కక్ష్యను 100 కిలోమీటర్లకు తగ్గిస్తామని, చివరగా 23న లేదా 24న చంద్రుడిపై ల్యాండింగ్ చేస్తామని వివరించింది. 

ల్యాండర్​లోని సెన్సర్లు ఇవే.


1.    లేజర్ ఇనెర్షియల్ రిఫరెన్సింగ్ అండ్ 
    యాక్సిలెరోమీటర్ ప్యాకేజ్ (లిరాప్) 
2.    కేఏ బ్యాండ్ అల్టిమీటర్ (కేఏఆర్ఏ)  
3.    ల్యాండర్ పొజిషన్ డిటెక్షన్  
    కెమెరా (ఎల్పీడీసీ)
4.    ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ 
    అవాయిడెన్స్ కెమెరా (ఎల్ హెచ్ డాక్) 
5.    లేజర్ అల్టిమీటర్ (లాసా) 
6.    లేజర్ డాప్లర్ వెలాసిమీటర్ (ఎల్డీవీ) 
7.    ల్యాండర్ హారిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్ హెచ్ వీసీ) 
8.    మైక్రోస్టార్ సెన్సర్ 
9.    ఇన్ క్లినోమీటర్ అండ్ టచ్ డౌన్ సెన్సర్స్