చంద్రుడికి 177 కి.మీ దూరంలో చంద్రయాన్ 3

చంద్రుడికి 177 కి.మీ దూరంలో  చంద్రయాన్ 3

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ –3 ప్రాజెక్టు కీలక దశకు చేరుకుంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో మరింత దగ్గరికి చేర్చింది. సోమవారం కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో సైంటిస్టులు వెల్లడించారు. 

ఈ ప్రక్రియ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ 150 కి.మీ. x 177 కి.మీ. ల నియర్ సర్క్యులర్ ఆర్బిట్​లోకి చేరిందని తెలిపారు. బుధవారం మరోమారు కక్ష్య తగ్గించి స్పేస్ క్రాఫ్ట్ ను జాబిల్లికి 100 కిలోమీటర్ల చేరువకు తీసుకెళతామని సైంటిస్టులు పేర్కొన్నారు. ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్ నుంచి ల్యాండర్ విడిపోతుందని వివరించారు. 

చంద్రుడిపై సాఫ్ట్ గా దిగేందుకు ల్యాండర్ వేగాన్ని తగ్గించుకుంటూ ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్​ అవుతుందని పేర్కొన్నారు. కాగా, గత నెల 14న చంద్రయాన్–3  ప్రయోగం చేపట్టగా ఈ నెల 5న స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడి కక్ష్యలోకి చేరింది. ఆ మరుసటి రోజే ఇస్రో సైంటిస్టులు స్పేస్ క్రాఫ్ట్ కక్ష్య తగ్గింపు ప్రక్రియను చేపట్టారు.