చంద్రయాన్ 3 గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇది. అంతరిక్షంలోనే కాదు.. చంద్రయాన్ 3 భూమిపైనా రికార్డు బద్దలు కొట్టింది.
చంద్రయాన్ 3 మిషన్ లో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పంపిన విక్రమ్ ల్యాండర్ బుధవారం (ఆగస్టు 23న) సాయంత్రం 6 గంటల 4 నిమిషాల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సేఫ్ గా ల్యాండ్ అయ్యి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
చంద్రుడిపై విక్రమ్ సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియను ప్రపంచ దేశాలు చూశాయి. సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియను యూట్యూబ్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఒకేసారి 80 లక్షల మంది వీక్షించారు. ఇది గతంలో18 లక్షలకు పైగా వీక్షకులు చూసిన రికార్డును అధిగమించింది.
sacnilk.com (సాక్నిల్క్)ప్రకారం...
* 2022, డిసెంబర్ లో జరిగిన FIFA పిఫా వరల్డ్ కప్ సందర్భంగా బ్రెజిల్, క్రొయేషియా మధ్య జరిగిన మ్యాచ్‌ను ఒకేసారి యూట్యూబ్ లో 61.5 లక్షల మంది వీక్షించారు.
* ఆ తర్వాత బ్రెజిల్, సౌత్ కొరియా మధ్య జరిగిన మ్యాచ్ ను ఒకేసారి యూట్యూబ్ లో 52 లక్షల మంది వీక్షించారు.
*ఈ రెండు మ్యాచ్‌లను బ్రెజిలియన్ ఛానెల్ కాజ్ టీవీ ప్రసారం చేసింది.
* చంద్రయాన్- 3 సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియను ఇస్రో అధికారిక యూట్యూబ్ ఛానెల్ ప్రసారం చేసింది.
జులై 14న శ్రీహరికోట నుంచి జీఎస్ ఎల్వీ మార్క్ 3 (ఎల్వీఎం3) రాకెట్ ద్వారా అంతరిక్షానికి చేరిన చంద్రయాన్ 3 స్పేస్ క్రాఫ్ట్ ఆగస్టు 1న భూకక్ష్యను వీడి చంద్రుడివైపుగా ప్రయాణం ప్రారంభించింది. 3. 84 లక్షల కిలోమీటర్ల ప్రయాణం తర్వాత ఆగస్టు 5వ తేదీన చంద్రుడి కక్ష్యను చేరింది.
అనంతరం దశలవారీగా కక్ష్యను 100 కిలోమీటర్లకు తగ్గించుకుంది. ఇస్రో సైంటిస్టులు ముందస్తుగా ఇచ్చిన కమాండ్లకు అనుగుణంగా.. బుధవారం సాయంత్రం (ఆగస్టు 23న) 5. 44 గంటలకు తనంతట తానుగా చివరి ఘట్టాన్ని ప్రారంభించింది. 20 నిమిషాల ఉత్కంఠభరి ప్రయాణంలో వేగాన్ని కంట్రోల్ చేసుకుంటూ నిటారుగా నిలబడి సరిగ్గా 6.04 గంటలకు పర్ ఫెక్ట్ గా చంద్రుడిపై ల్యాండ్ అయ్యింది. ఆ వెంటనే నేను గమ్యాన్ని చేరుకున్నా అంటూ ఇస్రోకు మెసేజ్ పంపింది.