- చంద్రుడి నుంచి మట్టిని తీసుకురానున్న ఇస్రో
- 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ నిర్మాణం
- ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు
- గగన్‌యాన్ మానవ సహిత స్పేస్ మిషన్ షెడ్యూల్ లో మార్పు లేదు
- ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడి
- ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 ప్రయోగాలు
- గగన్ యాన్ మానవ సహిత స్పేస్ మిషన్ షెడ్యూల్ మార్పు లేదు
- ‘పీటీఐ’ ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడి
బెంగళూరు: చంద్రుడి నుంచి మట్టి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు 2028లో చంద్రయాన్–4 మిషన్ ను చేపట్టనున్నట్టు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) చైర్మన్ వి.నారాయణన్ వెల్లడించారు. 2035 నాటికి భారత్ సొంత స్పేస్ స్టేషన్‌ను కూడా నిర్మించుకోనుందని ప్రకటించారు. 2027లో చేపట్టే గగన్ యాన్ మానవ సహిత అంతరిక్ష యాత్ర షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 7 రాకెట్ ప్రయోగాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇస్రో చేపట్టనున్న వరుస మిషన్ల గురించి ఈ మేరకు తాజాగా ‘పీటీఐ’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివరించారు.
ఈ ఏడాది చేపట్టే ప్రయోగాల్లో పూర్తి స్వదేశీ పరికరాలతో రూపొందించిన పీఎస్ఎల్వీ రాకెట్, ఒక కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్ మిషన్, మరికొన్ని పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మిషన్లు కూడా ఉన్నాయని తెలిపారు. చంద్రయాన్–4 మిషన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇది ఇస్రో చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన మిషన్‌గా నిలుస్తుందన్నారు. 2028లో ఈ మిషన్‌ను చేపడతామన్నారు. ప్రస్తుతం చంద్రుడి నుంచి మట్టి శాంపిల్స్‌ను తీసుకురాగలిగే సత్తా అమెరికా, రష్యా, చైనాకే ఉందని, ఈ మిషన్ సక్సెస్ అయితే భారత్ వాటి సరసన చేరుతుందన్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై వాటర్ ఐస్‌పై అధ్యయనం కోసం జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీతో కలిసి ‘లూపెక్స్’ మిషన్ కూడా చేపట్టనున్నట్టు వెల్లడించారు.
2028కల్లా కక్ష్యలోకి 5 మాడ్యూల్స్..
ప్రస్తుతం అమెరికా, తదితర దేశాల నేతృత్వంలోని ఐఎస్ఎస్, చైనాకు చెందిన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, భారత్ కూడా 2035 నాటికి సొంత స్పేస్ స్టేషన్ ను ఏర్పాటు చేసుకోనుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే పనులను ప్రారంభించామన్నారు. 2028 నాటికల్లా తొలి 5 మాడ్యూల్స్‌ను కక్ష్యలోకి చేరుస్తామన్నారు.
మానవ సహిత మిషన్ చేపట్టడానికి ముందు నిర్వహించే మానవ రహిత మిషన్ల షెడ్యూల్ ను మాత్రమే మార్చామన్నారు. వీటిని ఈ ఏడాదిలోనే పూర్తి చేస్తామని, షెడ్యూల్ ప్రకారం 2027లో మానవ సహిత మిషన్ ఉంటుందన్నారు. 2040 నాటికి చంద్రుడిపైకి భారత ఆస్ట్రోనాట్లను పంపే దిశగా పని చేయాలని ప్రధాని మోదీ ఇస్రోకు సూచించారని తెలిపారు.
2030 నాటికి స్పేస్ ఎకానమీలో 8% వాటా..
గ్లోబల్ స్పేస్ ఎకానమీలో ఇండియాకు ప్రస్తుతం 2 శాతం వాటా (8.2 బిలియన్ డాలర్లు) ఉందని, 2030 నాటికి దీనిని 8 శాతం(44 బిలియన్ డాలర్లు)కు పెంచాలని టార్గెట్ పెట్టుకున్నట్టు నారాయణన్ తెలిపారు. ప్రస్తుతం గ్లోబల్ స్పేస్ ఎకానమీ 630 బిలియన్ డాలర్ల మేరకు ఉందని, 2035 నాటికి ఇది 1.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు.
దేశంలో కొన్నేండ్ల క్రితం స్పేస్ సెక్టార్ లో కేవలం 3 స్టార్టప్ లే ఉండేవని, కేంద్రం 2020లో తెచ్చిన సంస్కరణల ఫలితంగా 450 ఇండస్ట్రీలు, 330 స్టార్టప్ లు ఇప్పుడు యాక్టివ్ గా పని చేస్తున్నాయన్నారు. డిమాండ్ కు తగ్గట్టుగా వచ్చే మూడేండ్లలో స్పేస్ క్రాఫ్ట్ ల ఉత్పత్తిని కూడా మూడు రెట్లకు పెంచుతామన్నారు.
