దళితబంధు స్కీం అమలులో మార్పులు

దళితబంధు స్కీం అమలులో మార్పులు
  • దళిత బంధు బాధ్యత ఎంపీడీవోలకు!
  • అర్హుల గుర్తింపులో ఎమ్మెల్యేల నిర్ణయమే ఫైనల్​.. త్వరలో గైడ్ లైన్స్
  • ఈ ఏడాది ఇంతవరకు స్కీంకు ఒక్క రూపాయి ఇయ్యలే
  • తక్షణం 500 మందికి రూ.5,900 కోట్లు అవసరం
  • నిధుల సర్దుబాటుపై తర్జనభర్జన

హైదరాబాద్, వెలుగు : దళితబంధు స్కీం అమలులో మార్పులు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు క్షేత్రస్థాయిలో దళితబంధు ఇంప్లిమెంటేషన్ బాధ్యతలను ఎంపీడీవోలకు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. త్వరలో ఈ స్కీం అమలుపై గైడ్​లైన్స్ ఇవ్వనున్నట్లు తెలిసింది. నిరుడు మొత్తం పైలట్ ప్రాజెక్ట్ అని.. ఇప్పుడు ఫేజ్​ల వారీగా ఎట్లివ్వాలనే దానిపై గైడ్​లైన్స్​ రెడీ చేస్తున్నట్లు సెక్రటేరియెట్​లో ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’కు తెలిపారు. అయితే ఇంతవరకు ఈ ఏడాదికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. ఎప్పుడిస్తారో తెలియదని అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దళితబంధు అమలు, నిధుల విడుదలపై 2నెలల కిందే సర్కార్​కు ఫైల్ పంపామని.. ఇప్పటికీ రిప్లై రాలేదని ఆ ఆఫీసర్ తెలిపారు. ఎమ్మెల్యేలు తయారు చేసిన లిస్ట్​లో ఉన్న దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది ఫస్ట్ 500 మందికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.5900 కోట్లు రిలీజ్ చేయాల్సి ఉంది.

పైసలు ఎప్పుడిస్తరు.. ఎప్పుడు మొదలైతది

ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌‌‌‌లో దళిత బంధు స్కీంకు ప్రభుత్వం రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని నియోజకవర్గానికి 1,500 మంది చొప్పున హుజురాబాద్ మినహా మిగిలిన అన్నింటిలో 1.77 లక్షల మంది అర్హులకు జమ చేయాల్సి ఉన్నది. బడ్జెట్ కు సంబంధించి రిలీజ్ ఆర్డర్ ఇచ్చి 8 నెలలు కావొస్తుంది. అయితే ఇంతవరకు ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. పైగా రెండు నెలల కిందట ఫస్ట్ 500 మందికి ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో సర్కార్​ నిధులు ఎప్పుడిస్తది ? గ్రౌండింగ్ ఎప్పుడు మొదలైతది? మిగిలిన వెయ్యి మందికి ఎప్పుడిస్తరు? అనేది గందరగోళంగా మారింది. ఎవరైనా దగ్గరి నాయకుడు దళిత బంధు గురించి అడిగితే మాత్రం.. సర్కార్ దగ్గర పైసలు లేవు ఎప్పుడిస్తారో చూడాలి అంటూ సమాధానం ఇస్తున్నారు. నిరుడు పైలెట్‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌ కింద హుజూరాబాద్‌‌‌‌ నియోజకవర్గం, మరో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలు, యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో అమలు చేసింది. ఇక రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లో వంద మంది చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఇందులో మొత్తం 38,496 లబ్ధిదారులకు గాను 37 వేల మందికి యూనిట్లు గ్రౌండ్ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు.

ఎమ్మెల్యేల చేతుల్లోనే ఉండాలని

ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ దళితబంధును అమలు చేస్తోంది. ఎమ్మెల్యేలు అర్హుల లిస్ట్ తయారు చేసి పంపిస్తే.. వాటికి సంబంధిత జిల్లా మంత్రి ఆమోదం చెప్తారు. ఆ తరువాత స్టేట్ ఎస్సీ కార్పొరేషన్​కు లిస్ట్ అందుతుంది. అక్కడి నుంచి జిల్లాల్లోని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ (ఎగ్జిక్యూటివ్​ డైరెక్టర్)లకు పంపుతారు. ఎవరికి ఏ యూనిట్ ఇవ్వాలనేది కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్ణయించి.. గ్రౌండింగ్ చేస్తారు. జిల్లాకు ఒక్కరే ఈడీ ఉండటంతో ఎమ్మెల్యేల పెత్తనం సాగడం లేదు. దీంతో మండల పరిధిలో ఎంపీడీవోలకు అప్పగిస్తే.. వారి పరిధిలోని మండలాల్లో ఉన్న అధికారులతో నచ్చినట్టు పనిచేయించుకోవచ్చనే ఉద్దేశంతో స్కీం గ్రౌండింగ్ బాధ్యతలు మార్చాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతోంది. అర్హుల ఎంపిక దగ్గర నుంచి యూనిట్ల గ్రౌండింగ్ వరకు అంతా తమ కనుసన్నల్లో.. తాము అనుకున్నట్లుగా జరగాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు తెలిసింది. అదే టైంలో ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండటంతో ఈడీ ఆఫీస్ మొత్తం చూసుకునే బదులు మండల ఆఫీస్​లకు అప్పగిస్తే బెటర్ గా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.