ప్రి డయాబెటిస్​​​ వస్తే లైఫ్ స్టైల్ మార్చుకోవడమే మందు

ప్రి డయాబెటిస్​​​ వస్తే లైఫ్ స్టైల్ మార్చుకోవడమే మందు

ఈ మధ్య ఆకలి బాగా పెరిగింది..ఆకలితో నిమిషం కూడా ఆగలేకపోతున్నా.. అదేంటో.. తింటున్నా కూడా బరువు తగ్గిపోతున్నా.. అరికాళ్లలో మంటలు.. గొంతు తడారిపోతోంది.. మాటిమాటికీ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది.. నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు.. ఇవన్నీ గమనించిన తర్వాత.. బహుశా షుగర్ వచ్చిందేమో అనిపించింది. టెస్ట్​ చేయించుకుంటే.. అలాంటిదేమీ లేదని తేలింది. మరి నాకు షుగర్ ఉన్నట్టా? లేనట్టా?

ప్రతి పదిమందిలో నలుగురికి సరిగ్గా ఇదే ఫీలింగ్ ఉంటోంది. ముఖ్యంగా ముప్పై ఏళ్ల వయసు దాటినవారిలో.. ఎనిమిది గంటలపాటు కుర్చీలో కూర్చొనే జాబ్​ చేసేవారిలో.. సాఫ్ట్​వేర్​ ఉద్యోగుల్లో ఈ ఫీలింగ్​ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇంతకీ వీళ్లంతా షుగర్​ ఉందని జాగ్రత్తపడాలా? టెస్టుల్లో తేలలేదు కాబట్టి మామూలుగానే ఉండాలా? ఈ ప్రశ్నలను డాక్టర్​ను అడిగినా సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే.. వీళ్లకు షుగర్​ ఉందని చెప్పలేం.. అలాగని లేదని కన్ఫామ్​ చేయలేం. మెడికల్​ లాంగ్వేజ్​లో ఈ స్టేజీని ప్రి–డయాబెటిక్​ అంటారు. అంటే.. షుగర్​ వ్యాధికి అడుగు దూరంలో ఉన్నారన్నమాట.

ప్రి–డయాబెటిస్​​​ అంటే…

ప్రి–డయాబెటిస్​ అంటే షుగర్​  రాకముందు.. -అది వచ్చే అవకాశం వున్న స్టేజ్​ అన్నమాట. క్లియర్​గా చెప్పాలంటే శరీరంలో గ్లూకోజ్ స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండి..  షుగర్​ నిర్ధారించడం కంటే తక్కువగా ఉన్న స్థితినే ప్రి–డయాబెటిస్​- అంటారు. జాగ్రత్తలు తీసుకోకపోతే అతి త్వరలో షుగర్​ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ఈ స్థితిలో ఉన్నవారు హార్ట్​ ఎటాక్​కు, హై బీపీకి గురయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే టైప్​–2 డయాబెటిస్​​ వస్తుంది.
ఈ స్థితిలో ఉన్నప్పుడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే… అంటే, ఎత్తుకు తగిన బరువును మెయింటెయిన్​ చేయడం, తగినంత శారీరక శ్రమ ఉండేలా లైఫ్​ను ప్లాన్​ చేసుకోవడం, జంక్​ ఫుడ్​ జోలికి వెళ్లకుండా ఫైబర్​ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, రోజూ ఎక్సర్​సైజ్​ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్​ వచ్చే అవకాశం ఉండదు.

ప్రి–డయాబెటిక్​ స్టేజీని ఎలా డిసైడ్​ చేస్తారు?

షుగర్​ ఉందా? లేదా? అనేది నిర్థారించినట్లే  ప్రి–డయాబెటిస్​ను నిర్ధారించడానికి కూడా రక్త పరీక్షలు చేస్తారు. షుగర్​ లెవెల్స్​ను క్షణాల్లో చెప్పే పరికరాలు వచ్చేశాయి. ఇంట్లోనే టెస్టు చేసుకొని షుగర్​ లెవెల్స్​ను చెక్​ చేసుకుంటున్నారు. అయితే ప్రీడయాబెటిక్​ స్టేజీని గుర్తించడం అంత ఈజీ కాదు. సేకరించిన రక్తాన్ని పరీక్షల కోసం ల్యాబ్​కు పంపాల్సి ఉంటుంది. ల్యాబ్​ అనాలసిస్​లో మాత్రమే ఈ ప్రి–డయాబెటిస్​​ స్టేజీ నిర్ధారణ అవుతుంది.

ఏయే పరీక్షలు చేస్తారంటే…

 A1C టెస్ట్​ హిమోగ్లోబిన్ A1C టెస్ట్
​ఫాస్టింగ్ ప్లాస్మా గ్లూకోజ్​ (FPG) టెస్ట్​
ఓరల్ గ్లూకోజ్​ టాలరెన్స్ టెస్ట్ (OGTT)

రక్తంలో షుగర్​ లెవెల్స్​ తినకముందు 100–125 mg/dl, తిన్న తర్వాత 140 –199 mg/dl ఉన్నవాళ్లు ప్రి–డయాబెటిక్​ స్టేజీలో ఉన్నట్లు చెప్తారు. కొన్ని సందర్భాలలో రెగ్యులర్​ హెల్త్​ చెకప్​ సమయంలో చేసే రాండమ్ ప్లాస్మా గ్లూకోజ్​(RPG) అనే ఇంకో టెస్ట్​చేస్తారు.  RPG లో ఒక డెసి లీటర్ రక్తం లో 200 మైక్రోగ్రామ్స్  లేదా ఎక్కువ గ్లూకోజ్ ఉన్నా కూడా దానిని ప్రి–డయాబెటిక్​​గానే భావిస్తారు.

ఎవరికి రావడానికి అవకాశం ఉంది?

ప్రి–డయాబెటిక్​ ​ స్టేజీలో ఉన్నవాళ్లలో ఎవరు టైప్​–2 షుగర్​బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే..  పేరెంట్స్​కు షుగర్​ ఉంటే..  ఎత్తుకు తగిన బరువు కంటే ఎక్కువగా ఉంటే..  ఒబేసిటీతో బాధపడేవాళ్లు. శ్రమలేని జీవితాన్ని గడుపుతున్న వాళ్లు తరచూ స్ట్రెస్​కు గురయ్యేవాళ్లు. కొలెస్ట్రాల్‌‌ (లేక) ట్రైగ్లిజరైడ్‌‌ స్థాయి ఎక్కువగా ఉన్నవాళ్లు. నాలుగు కిలోల బరువున్న పాపాయికి తల్లయిన స్త్రీలు స్టెరాయిడ్స్​ మందులు తీసుకునేవాళ్లకు.

ప్రి–డయాబెటిక్​ స్టేజీలో ఉండి.. షుగర్​ వ్యాధి వచ్చే అవకాశాలు ఎప్పుడు? ఎంతమేర? ఉంటాయంటే.. 

తల్లిదండ్రులిద్దరికీ షుగర్​ ఉంటే-99%  తల్లిదండ్రుల్లో ఒకరికి షుగర్​ ఉండి రెండోవాళ్ల బంధువులెవరికైనా షుగర్​ ఉంటే -75%   దగ్గరి బంధువుల్లో ఎవరికైనా షుగర్​ ఉంటే – 50% రిలేటివ్స్​లో ఎవరికైనా షుగర్​ ఉంటే -25%.

అనుమానం ఉన్నవారు ఎప్పుడు? ఏయే? టెస్టులు చేయించుకోవాలంటే..

నెలకోసారి: ఫాస్ట్​, పోస్ట్​ లంచ్​ బ్లడ్​ షుగర్ 2-3 నెలలకోసారి: గ్లైకోజిలేటెడ్‌‌ హిమోగ్లోబిన్‌‌ – 12 నెలలకోసారి: లైపిడ్‌‌ప్రొఫైల్‌‌, కిడ్నీ​, యూరియా, క్రియాటినైన్‌‌, హార్ట్​, లివర్, కంటి రెటీనా టెస్టులు ఆర్నెల్లకోసారి: మైక్రో ఆల్బుమిన్‌‌.

ప్రి–డయాబెటిక్​ ​అని ఎప్పుడు అనుమానించాలి?

అదే పనిగా బాత్రూమ్​కు వెళ్తుంటే..
అతిగా దాహం వేస్తుంటే అతిగా ఆకలవుతుంటే
అకస్మాత్తుగా బరువు తగ్గిపోతే
అకస్మాత్తుగా చూపు మందగిస్తే గాయాలు త్వరగా మానకపోతే
తరచూ నీరసంగా, నిస్సత్తువగా అనిపిస్తే
ఫంగల్‌‌ ఇన్ఫెక్షన్స్‌‌ వస్తుంటే

ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? 

షుగర్​ వ్యాధి ఉన్నవాళ్లు తీసుకున్న జాగ్రత్తలే ప్రి–డయాబెటిక్​ ​ స్టేజీలో ఉన్నవాళ్లు కూడా తీసుకోవాలి. సరైన ఆహార నియమాలు పాటించడం, రెగ్యులర్‌‌గా వ్యాయామం చేయడంతోపాటు వ్యాధికి సంబంధించి అవగాహన పెంచుకోవాలి.

లైఫ్​స్టైల్​ మార్చుకోవడమే మందు..

ప్రి–డయాబెటిక్​​కు ట్యాబ్లెట్స్​, ఇంజెక్షన్స్​తో చేసే ట్రీట్​మెంట్ ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే డాక్టర్​ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. టెస్టుల్లో ప్రి–డయాబెటిక్​ ​ స్టేజ్​లో ఉన్నారని తేలితే.. ముందుగా చేయాల్సింది లైఫ్​స్టైల్​ మార్చుకోవడమే. తక్కువ కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకుంటూ.. ఎక్కువ కేలరీలు ఖర్చయ్యే లైఫ్​స్టైల్​ను అలవాటు చేసుకుంటే షుగర్​ రాకుండా చూడొచ్చు. అందుకే.. తక్కువ కార్బోహైడ్రేట్స్​​ ఉన్న ఆహారాన్ని తినాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. జంక్​ ఫుడ్​కు దూరంగా ఉండాలి. రోజులో కనీసం అరగంటపాటైన ఎక్సర్​సైజ్​ చేయాలి. కేవలం నడక మాత్రమే సరిపోదు. బ్రిస్క్​వాక్​ చేయాలి. రన్నింగ్​, స్విమ్మింగ్​ చేయడం వల్ల కూడా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. 40 సంవత్సరాలు దాటిన ప్రతిఒక్కరూ షుగర్​కు సంబంధించిన టెస్టులు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్​ వచ్చాక ఇబ్బంది పడే బదులు రాకుండా జాగ్రత్త పడడమే మేలు కదా.

– బియాట్రిస్​ యాన్​, ఎండోక్రైనాలజీ డిపార్ట్​మెంట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్​, నిమ్స్​ హాస్పిటల్