పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?

 పంజాబ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరు?

పంజాబ్ కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థి ఎవరు? ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ, లేదా పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూనా ? వీరిద్దరిలో అధిష్టానం ఆశీస్సులు ఎవరికి ఉన్నాయనే విషయం రెండు రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో జరగనున్న సమావేశంలో సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇవ్వనున్నారు. అందుకోసం పార్టీ సభ్యులతో సంప్రదింపులు జరిపి వారందరి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. చర్చలు చివరి దశలో ఉన్న సమయంలో చన్నీ, సిద్ధూ మధ్య అసమానతలు మెరుగ్గా ఉన్నాయని తేలింది. రాహుల్ గాంధీ జలంధర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఈ వారంలో ప్రకటిస్తామని చెప్పారు. ఒక పార్టీని ఇద్దరు వ్యక్తులు నడపలేరని  తేల్చిచెప్పారు. అంతకు ముందే చన్నీ, సిద్ధూతో రాహుల్ మాట్లాడారు. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని వారిద్దరూ రాహుల్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటించదు. సంప్రదాయానికి విరుద్ధంగా  పంజాబ్  కాంగ్రెస్ కార్యకర్తల కోరిక మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నికలకు ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు. లేకుంటే కాంగ్రెస్ లో వీరిద్దరి మధ్య అంతర్గత పోరు తారాస్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఎన్నికల ముందు అది పార్టీకి తీరని నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే చన్నీ, సిద్ధూ మధ్య సంబంధాలు సజావుగా లేవని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే వీరిద్దరి ఆధిపత్యానికి అడ్డుకట్ట పడుతుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. అందుకే సీఎం అభ్యర్థి ఎంపికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది.

మరిన్ని వార్తల కోసం

సభలో బహిరంగ చర్చలకు సిద్ధం

ప్రభుత్వం 80 శాతం రైతులకు ప్రాధాన్యత