నాకు సీఎం పదవి రాలేదన్న నిరాశ లేదు.. చన్నీ నా తమ్ముడి లాంటోడు

నాకు సీఎం పదవి రాలేదన్న నిరాశ లేదు.. చన్నీ నా తమ్ముడి లాంటోడు

పంజాబ్ సీఎంగా తనకు అవకాశం రానందుకు నిరాశ ఏం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్జిందర్ సింగ్ రణ్‌ధావా చెప్పారు. పంజాబ్‌  కొత్త సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం సుఖ్జిందర్‌‌నే ఎంపిక చేసిందంటూ వార్తలు వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన పేరు కాకుండా చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ సీఎం అంటూ ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో సుఖ్జిందర్ మీడియాతో మాట్లాడుతూ సీఎంగా చరణ్‌జిత్ చన్నీని ప్రకటిస్తూ హైకమాండ్ నిర్ణయం తీసుకుందని, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. చన్నీ తన తమ్ముడి లాంటివాడని, తనకు సీఎం పదవి రానందుకు ఎలాంటి నిరాశ లేదని తెలిపారు.

నిన్న సాయంత్రం పంజాబ్ సీఎం పదవికి కెప్టెన్ అమరిందర్ సింగ్ రాజీనామా చేయడం సుదీర్ఘ మంతనాల తర్వాత ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ హరీశ్ రావత్ తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. పంజాబ్‌కు కొత్త సీఎం ఎంపికపై కాంగ్రెస్ హైకమాండ్ నిన్నటి నుంచి కసరత్తు ప్రారంభించింది. ఈ రోజు ఉదయం పంజాబ్ ఎంపీ అంబికా సోనీతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. సీఎంగా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాను సీఎం పదవిని సున్నితంగా తిరస్కారించానని, ఒక సిక్కు నేతకే ఆ పదవి అప్పగించాలని హైకమాండ్‌కు సూచించానని ఆమె తెలిపారు. సిద్ధూ సీఎం కావాలని కోరుకున్నప్పటికీ ఆయన పట్ల అమరిందర్‌‌తో పాటు పలువురు సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ ఆయన పట్ల మొగ్గు చూపలేదు. అయితే పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ సునీల్ జాఖర్, సుఖ్జిందర్ సింగ్ రణ్‌ధావా, పార్టీ నేతలు త్రిప్త్ రాజీందర్ సింగ్ బజ్వా, బ్రహ్మ మోహింద్రా, విజయేందర్ సింగ్లా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్జీత్ సింగ్ నగ్రా తదితరులు సీఎం రేసులో ఉన్నారని ప్రధానంగా వినిపించింది. అయితే సుఖ్జిందర్‌‌ సింగ్‌ను సీఎంగా ఎంపిక చేశారని, ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని వార్తలు వచ్చాయి. కానీ కొద్దిసేపటి తర్వాత ఆయనే మీడియా ముందుకు వచ్చి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, మరికొద్ది సేపటిలో హైకమాండ్ సీఎం ఎవరనేది ప్రకటిస్తుందని చెప్పారు. ఎట్టకేలకు హరీశ్ రావత్ ట్వీట్‌తో ఉత్కంఠకు తెరపడింది.