గో ఫస్ట్‌‌‌‌ దివాలాతో భారీగా పెరిగిన ఛార్జీలు

గో ఫస్ట్‌‌‌‌ దివాలాతో భారీగా పెరిగిన ఛార్జీలు
  • ఢిల్లీ-లే మధ్య రూ.26,819 కి పెరిగిన టికెట్ ధర
  • రేట్లు ఇప్పటిలో  తగ్గవంటున్న ఎనలిస్టులు

బిజినెస్‌‌‌‌ డెస్క్‌‌‌‌, వెలుగు: ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ గో ఫస్ట్ తమ సర్వీస్‌‌‌‌లను ఈ నెల 12 వరకు  నిలిపివేయడంతో చాలా రూట్లలో విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి.  కంపెనీ ఎన్‌‌‌‌సీఎల్‌‌‌‌టీ దగ్గర వాలంటరీ ఇన్‌‌‌‌సాల్వెన్సీ ఫైల్ చేయడంతో  ఛార్జీలు ఇప్పట్లో తగ్గవని ఎక్స్‌‌‌‌పర్టులు చెబుతున్నారు. గోఫస్ట్‌‌‌‌ దివాలా  బాట పట్టడం, స్పైస్ జెట్ ఇబ్బందుల్లో ఉండడంతో ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో చివరికి రెండే కంపెనీలు మిగలొచ్చని అభిప్రాయపడుతున్నారు.  ఇలా జరిగితే కస్టమర్లు ఎక్కువగా నష్టపోతారు. ఏవియేషన్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో కాంపిటేషన్ ఉండడంతోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. ఒకవేళ రెండే కంపెనీలు మిగిలితే విమాన ఛార్జీలు ఇష్టానుసారంగా పెరుగుతాయి.   ఢిల్లీ–లే రూట్‌‌‌‌లో టికెట్ ధర ఈ నెల 5 న రూ.26,819 కి పెరిగింది.   గో ఫస్ట్ సంక్షోభం తర్వాత ఈ రేటు 4–6 రెట్లు పెరగడాన్ని గమనించాలి. సాధారణంగా  ఢిల్లీ–లే మధ్య విమాన ఛార్జీ రూ.4,771 గా ఉంటోంది. ఛండీగడ్‌‌‌‌–శ్రీనగర్‌‌‌‌‌‌‌‌ మధ్య విమాన ఛార్జీ గతంలో రూ.4,047 గా ఉండగా, తాజాగా రూ.24,418 కి  ఎగిసింది. అదే శ్రీనగర్–ఢిల్లీ రూట్‌‌‌‌లో ఛార్జీ మే 6 తేదికి రూ.26,148 కి పెరిగింది. గతంలో ఈ ధర రూ.4,745  దగ్గర ఉండేది. ఆదివారానికి గాను హైదరాబాద్‌‌‌‌–ఢిల్లీ మధ్య విమాన ఛార్జీ రూ.16 వేలు పలుకుతోంది. 

సీట్లు ఖాళీ లేవ్‌‌‌‌..

విమాన ఛార్జీలు ఆర్టిఫిషియల్‌‌‌‌గా మాత్రమే పెరగడం లేదని, క్లియర్‌‌‌‌‌‌‌‌గా డిమాండ్ కనిపిస్తోందని ఎనలిస్టులు చెబుతున్నారు. విమానాలలో ఆక్యుపెన్సీ (సీట్లు నిండడం) పెరిగిందని అంటున్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలన్నీ 90‌‌‌‌‌‌‌‌ శాతం కెపాసిటీతో నడుస్తున్నాయని  ఎయిర్ ఇండియా మాజీ డైరెక్టర్​ జితేంద్ర భార్గవ్‌‌‌‌ పేర్కొన్నారు. గో ఫస్ట్ ప్యాసింజర్లకు సీట్లు దొరకడం లేదని,  ఉన్న తక్కువ సీట్ల కోసం పోటీ పెరుగుతోందని వివరించారు. అందుకే ధరలు భారీగా పెరిగాయన్నారు.  గో ఫస్ట్ ఇప్పట్లో కొలుకునేటట్టు కనిపించడం లేదని, కంపెనీ రికవరీ అవ్వడానికి రెండు మూడేళ్లయినా పడుతుందని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. మరోవైపు  ఫ్యూయల్ ధరలు పెరగడం కూడా ధరలు పెరగడానికి కారణంగా ఉందని వెల్లడించారు. 

ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలకు ఏమవుతోంది? 

గ్లోబల్‌గా  మూడో అతిపెద్ద ఏవియేషన్  మార్కెట్‌‌‌‌, కరోనా ముందు స్థాయిలకు చేరుకున్న డిమాండ్‌‌‌‌, పుట్టుకొస్తున్న కొత్త కంపెనీలు...దేశ ఏవియేషన్ సెక్టార్ చూడడానికి పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌గా కనిపిస్తున్నప్పటికీ కంపెనీలు  నడవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పటికే విజయ్‌‌‌‌ మాల్యా కింగ్‌‌‌‌ఫిషర్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌, నరేష్ గోయెల్‌‌‌‌కు చెందిన జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్ మూతపడ్డాయి. తాజాగా గో ఫస్ట్ దివాలా బాట పట్టింది. టికెట్  ధరలు చౌకగా ఉండడం, ఫ్యూయల్‌‌‌‌పై ట్యాక్స్‌‌‌‌ ఎక్కువగా ఉండడం,  పోటీ పెరగడంతో ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు బతకడానికి కష్టపడుతున్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు. న్యూ ఢిల్లీ– ముంబై మధ్య 90 నిమిషాల వన్‌‌‌‌ వే జర్నీకి సగటున రూ.6,500 ఛార్జీ పడుతుండగా, ఇంతే దూరం ఉండే న్యూ యార్క్‌‌‌‌ – అట్లాంటా మధ్య సగటున రూ.16 వేలు ఛార్జ్ చేస్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు జెట్ ఫ్యూయల్‌‌‌‌పై 30 శాతం వరకు ట్యాక్స్‌‌‌‌లు విధిస్తున్నాయి. ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీల మొత్తం ఖర్చుల్లో సగం ఫ్యూయల్ ఖర్చులే ఉన్నాయి. ఇండిగో వంటి పెద్ద కంపెనీలు తమ ప్రత్యర్ధి కంపెనీలు తిరుగుతున్న రూట్లలో టికెట్ ఛార్జీలను తక్కువగా వసూలు చేస్తున్నాయి. కాంపిటేషన్ లేని రూట్లలో ఎక్కువ ఛార్జీలు వేస్తున్నాయి. దీంతో చిన్న కంపెనీలు మార్కెట్‌‌‌‌లో బతకడానికి కష్టపడుతున్నాయి. మరోవైపు కరోనా సంక్షోభ నష్టాల నుంచి కంపెనీలు ఇంకా బయట పడలేదని చెప్పొచ్చు. డాలర్ మారకంలో రూపాయి విలువ పతనమవ్వడంతో  కూడా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు నష్టపోయాయి. 2019 ప్రారంభం నుంచి చూస్తే డాలర్ మారకంలో రూపాయి విలువ 20 శాతం తగ్గింది. 
దీంతో విదేశాల నుంచి  విమానాలను లీజుకు తెచ్చుకునే కంపెనీలపై భారం పెరిగింది. ప్రభుత్వం కూడా డైరెక్ట్‌‌‌‌గా కంపెనీలకు సాయం అందించడం లేదు. చాలా సార్లు రేట్లను తగ్గించాలని కోరింది కూడా. 

పుట్టుకొస్తున్న కొత్త కంపెనీలు..

మార్కెట్‌‌‌‌లో ఇబ్బందులు ఉన్నప్పటికీ కొత్త కంపెనీలు పుట్టుకొస్తుండడాన్ని చూడొచ్చు. ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇప్పటికే సర్వీస్‌‌‌‌లను ప్రారంభించగా, మూతపడిన జెట్ ఎయిర్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌ మళ్లీ రంగ ప్రవేశం చేయడానికి రెడీ అవుతోంది.  కొత్త కంపెనీలు పుట్టుకొస్తుండడానికి కారణం మార్కెట్‌‌‌‌లో బోలెడు అవకాశాలు ఉండడమేనని ఎనలిస్టులు చెబుతున్నారు. జపాన్‌‌‌‌ను దాటి ఇండియా మూడో అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్‌‌‌‌గా 2016 లోనే అవతరించింది. ముందుకెళ్లే కొద్దీ దేశ ఎకానమీ మరింతగా విస్తరించనుంది. ఇండియాలో యువత ఎక్కువగా ఉండడంతో ఏవియేషన్ సెక్టార్ దూసుకుపోతుందని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.