లండన్: రెండో ఎలిజబెత్ రాణి 15 దేశాలకు అధినేతగా వ్యవహరించారు. ఆమె బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్ దేశాలైన ఆంటిగ్వా అండ్ బర్బుడా, ఆస్ట్రేలియా, బహమాస్, బిలైజ్, కెనడా, గ్రెనడా, జమైకా, న్యూజీలాండ్, పపువా న్యూగినియా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడిన్స్, సోలోమన్ ఐల్యాండ్స్, టువాలు దేశాలకు పాలనాధిపతిగా ఉన్నారు.
బ్రిటన్ కింగ్ గా చార్లెస్
క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో ఆమె పెద్ద కొడుకు చార్లెస్(73) బ్రిటన్ రాజు అయ్యారు. శతాబ్దాల కాలం నుంచి బ్రిటన్ రాయల్ ఫ్యామిలీలో వస్తున్న ప్రొటోకాల్ ప్రకారం సింహాసనంపై ఉన్న వారు మరణించిన వెంటనే వారి మొదటి వారసులు చక్రవర్తి అవుతారు.
క్వీన్ డెత్.. మారిన కోడ్ నేమ్
క్వీన్ ఎలిజబెత్ చనిపోతే.. ఆమె మరణాన్ని ఎప్పుడు ప్రకటించాలి? ఆ తర్వాత అధికారికంగా అంత్యక్రియల వరకూ చేపట్టాల్సిన కార్యక్రమాలను బ్రిటన్ ప్రభుత్వం ‘ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్’ కోడ్ నేమ్ తో గతంలోనే ప్లాన్ ను సిద్ధం చేసింది. అయితే, క్వీన్ ఇంగ్లాండ్ లో కాకుండా స్కాట్లాండ్లో చనిపోయినట్లైతే ‘ఆపరేషన్ యూనికార్న్ (స్కాట్లాండ్ జాతీయ జంతువు.. ఒంటి కొమ్ము రెక్కల గుర్రం)’ కోడ్ నేమ్‌తో ఉన్న ప్లాన్ ను అమలు చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. దీంతో క్వీన్ మరణం తర్వాత కోడ్ నేమ్ మారిపోయింది.
కమిలా చేతికి కోహినూర్ కిరీటం
రెండో ఎలిజబెత్ మరణంతో ప్రిన్స్ చార్లెస్ బ్రిటన్ కింగ్ కావడంతో ఆయన భార్య కమిలాకు క్వీన్ కాన్సర్ట్ హోదా లభించింది. దీంతో ఇప్పటివరకూ క్వీన్ ఎలిజబెత్ వద్ద ఉన్న కోహినూర్ కిరీటం ఇకపై రాజు భార్య హోదాలో ఉన్న కమిలా వద్దకు చేరనుంది.
