బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 కన్నుమూయడంతో.. ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్ 3కి వెంటనే సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. శనివారం ఉదయం యాక్సెషన్ కౌన్సిల్ సమావేశంలో చార్లెస్ 3 ను చక్రవర్తిగా అధికారికంగా ప్రకటిస్తారని బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. లండన్ లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్ వేదికగా జరిగే యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో దీనిపై ప్రకటన వెలువడుతుందని తెలిపింది. యాక్సెషన్ కౌన్సిల్ లో బ్రిటన్ సీనియర్ ఎంపీలు, సీనియర్ సివిల్ సర్వెంట్లు, కామన్వెల్త్ దేశాల హై కమిషనర్లు, లండన్ మేయర్, క్యాబినెట్ మంత్రులు, న్యాయమూర్తులు సభ్యులుగా ఉంటారు. చార్లెస్ 3ను చక్రవర్తిగా ప్రకటించే యాక్సెషన్ కౌన్సిల్ సమావేశానికి దాదాపు 700 మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
చివరగా 1952 సంవత్సరంలో..
చివరగా 1952 సంవత్సరం ఫిబ్రవరి 6న యాక్సెషన్ కౌన్సిల్ సమావేశమై.. కింగ్ జార్జ్ 6 మరణానంతరం ఆమె కూతురు ఎలిజబెత్2ను రాణిగా ప్రకటించింది. అప్పట్లో ఆ సమావేశానికి దాదాపు 200 మంది ప్రముఖులు హాజరయ్యారు. అయిత 1953 జూన్ 2న ఆమెకు పట్టాభిషేకం జరిగింది.
రేపు ఏం జరుగుతుందంటే..
శనివారం ఉదయం జరగబోయే సమావేశంలో క్వీన్ ఎలిజబెత్ మరణంపై యాక్సెషన్ కౌన్సిల్ అధ్యక్షుడు, బ్రిటన్ ఎంపీ పెన్నీ మోడౌంట్ సంతాప ప్రకటన చేస్తారు. దీనిపై బ్రిటన్ ప్రధానమంత్రి , క్యాంటర్ బరీ ఆర్చిబిషప్, లార్డ్ చాన్స్ లర్ సంతకాలు చేస్తారు. అనంతరం చక్రవర్తి హోదాలో యాక్సెషన్ కౌన్సిల్ తో చార్లెస్ 3 సమావేశమవుతారు. ఈసందర్భంగా ‘స్కాట్లండ్ చర్చిని పరిరక్షిస్తాను’ అని కొత్త రాజు ప్రమాణం చేస్తారు. ఇది 18వ శతాబ్దం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం. ఆ తర్వాత రాయల్ బ్యాండ్ వాద్యాల నడుమ చార్లెస్ ను కొత్త రాజుగా ప్రకటిస్తారు. సెయింట్ జేమ్స్ ప్యాలెస్ లోని ఫెయిరీ కోర్ట్ బాల్కనీ నుంచి ‘గార్టర్ కింగ్ ఆఫ్ ఆర్మ్స్’ గా వ్యవహరించే ఓ అధికారి ప్రజా సమక్షంలో ఈ ప్రకటన చేస్తారు. ‘రాజును ఆ భగవంతుడు రక్షించుగాక’ అంటూ బిగ్గరగా చెబుతారు. 1952 తర్వాత మళ్లీ తొలిసారిగా ఇప్పుడు ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ జాతీయ గీతాన్ని వినపించబోతున్నారు. ఇక కొన్ని నెలల తర్వాత వెస్ట్ మినిస్టర్ అబేలో చార్లెస్ 3 పట్టాభిషేక మహోత్సవం జరుగుతుంది. కాగా, చార్లెస్ నవంబరు 14, 1948లో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో జన్మించారు. ఎలిజబెత్ నలుగురు సంతానంలో చార్లెస్ పెద్దవారు.
