చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

పురాతన కట్టడం వద్ద డ్రిల్లింగ్, తవ్వకాలు
కంపిస్తున్న భూమి, కదులుతున్న బిల్డింగ్స్
రూల్స్ పట్టించుకోని వాటర్ బోర్డు అధికారులు

హైదరాబాద్, వెలుగు : వాటర్ బోర్డు అధికారులు కొత్త పైప్ లైన్ పనుల్లో రూల్స్ ని పట్టించుకోవడం లేదు.  పురాతన కట్టడాలు, హెరిటేజ్ బిల్డింగ్స్ ఉన్న చార్మినార్ ఏరియాలో పైప్ లైన్ ను మార్చేందుకు ప్రమాదకరంగా డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో చార్మినార్ సహా 400 ఏండ్ల క్రితం నాటి పురాతన బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రిల్లింగ్ గానీ బ్లాస్టింగ్ గానీ ఇతర నిర్మాణాలు చేపట్టాలంటే ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే చార్మినార్ పీఎస్ నుంచి మోతీగల్లీ  వరకు ఉన్న 250 మీటర్ల వరకు పాత సీవరేజీ పైపు లైన్ ను తీసేసి 400 ఎంఎం సీవరేజీ పైపులను మారుస్తున్నారు. దీంతో వైబ్రేషన్స్ చార్మినార్ వరకు వస్తున్నాయి. చార్మినార్ పక్కనే ఉన్న షాహీజీ ఖా కమాన్ కూలిపోయే ప్రమాదం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే డ్రిల్లింగ్ పనులను ఆపకపోతే చార్మినార్ కు ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

4 రోజులుగా జరుగుతున్న వర్క్స్

వాటర్ బోర్డు అధికారులు చేస్తున్న పనులు చారిత్రాక కట్టడాలకు ప్రమాదంగా మారాయి. 4 రోజులుగా 250 మీటర్ల పొడవైన పైపు లైను మార్చేందుకు 5 ఫీట్ల లోతులో ఉన్న పాత పైపు లైన్ బయటకు తీస్తున్నారు. ఇందుకోసం  ఫీటు మందం ఉన్న సీసీ రోడ్డును తొలగిస్తున్నారు. దీనికి ప్రొక్లెయిన్ వాడటంతో పాటు డ్రిల్లింగ్ కారణంగా పాత భవనాలు కంపిస్తున్నాయి. రెండేళ్ల కిందట జీహెచ్ఎంసీ చేపట్టిన సీసీ రోడ్ల కోసం తవ్వినప్పుడు కూడా చార్మినార్ గోడల నుంచి డంగు సున్నం రాలింది. ప్రస్తుతం చేస్తున్న పనుల కారణంగా భారీ శబ్ధాలతో పాటు భూమి కదులుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రిల్లింగ్ మెషీన్ లతో గుంతలు తవ్వేప్పుడు ప్రెజర్ తక్కువగా ఉండేలా, పాత బిల్డింగ్ లు డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా పనులు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. వాటర్ బోర్డు సిబ్బంది మాత్రం ఉన్నతాధికారుల అనుమతులతోనే పనులు చేస్తున్నామని చెబుతున్నారు.

రింగ్​ మెయిన్ కోసం పర్మిషన్ లేకుండానే

సిటీలోనే కాకుండా కొల్లూరు, తెల్లాపూర్ పరిసరాల్లోనూ వాటర్ బోర్డు అధికారులు రింగ్ మెయిన్ ప్రాజెక్టు పనుల కోసం బ్లాస్టింగ్ చేశారు. భారీ పైప్ లైన్ వేసేందుకు ఎలాంటి పర్మిషన్స్  లేకుండానే బ్లాస్టింగ్ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.  బ్లాస్టింగ్​తో భారీ శబ్ధాలు, ప్రకంపనాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.  బ్లాస్టింగ్ కోసం చేసే రంధ్రాలతో కూడా భూమి కంపిస్తోందని, మందుగుండు పేలితే భూమి ఒక్కసారి వైబ్రేట్ అవుతుందని ఎక్స్ పర్ట్స్  చెప్తున్నారు.  ఎక్సావేకేషన్ పనుల కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.  కానీ వాటర్ బోర్డు అధికారులు ఇవేమీ పట్టన్నట్లుగా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు.

అధికారులే రూల్స్ పట్టించుకుంటలేరు

చారిత్రక కట్టడాలు, భవనాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలకు దగ్గరగా ఎలాంటి పనులు చేపట్టకూడదు. చారిత్రక కట్టడమైన చార్మినార్ పక్కనే ఈ పనులు చేపట్టడంతో  బిల్డింగ్ నిర్మాణం దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండేళ్ల కిందట కూడా జీహెచ్ఎంసీ అధికారులు తవ్వినప్పుడు ఆర్కియాలజీ విభాగానికి ఫిర్యాదు చేయడంతో పనులు ఆపేశారు. ఇప్పుడు కూడా గుట్టుగా పనులు సాగుతున్నాయి. చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాల పరిరక్షించాలనే నిబంధనలేవి అధికారులకు పట్టవు.                              ‑ అనురాధ రెడ్డి, ఇంటాక్ కన్వీనర్