సెల్‌‌ఫోన్ శత్రువైతే?

సెల్‌‌ఫోన్ శత్రువైతే?

అచ్చ తెలుగు ఓటీటీ ఆహా వచ్చిన తర్వాత అన్ని భాషల సినిమాలనూ మాతృభాషలో చూసే చాన్స్ దొరుకుతోంది తెలుగు ప్రేక్షకులకి. ఇప్పటికే స్ట్రాంగ్ కంటెంట్‌‌తో తెరకెక్కిన పలు చిత్రాల్ని అందించిన ఈ సంస్థ.. ఇప్పడు మరో ఇంటరెస్టింగ్ మూవీని తీసుకొస్తోంది. మంజు వారియర్ నటించిన మలయాళ చిత్రం ‘చతుర్ ముఖం’ ఆగస్ట్ 13న అదే పేరుతో ఆహాలో విడుదలవుతోంది. ఈ సినిమాకి రంజిత్ కమల శంకర్ దర్శకుడు. మలయాళ వెర్షన్ ఏప్రిల్‌‌లో రిలీజయ్యింది. పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌‌లో ప్రదర్శితమై కాంప్లిమెంట్స్ అందుకుంది. తేజస్విని అనే ఓ మిడిల్ క్లాస్‌‌ లేడీ సీసీ టీవీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. ఆమె మొబైల్ ఫోన్‌‌కి అడిక్ట్ అవుతుంది. అనుకోకుండా ఫోన్ పాడవడంతో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌‌ ఉన్న ఓ ఫోన్‌‌ని కొనుక్కుంటుంది. అప్పట్నుంచి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఓ ఫ్రెండ్‌‌లా ఫీలయ్యే సెల్‌‌ఫోన్‌‌ శత్రువులా మారిపోతుంది. ఆమెని రకరకాల సమస్యల్లో పడేస్తుంది. వాటి నుంచి తేజస్విని ఎలా బయటపడింది? అసలా ఫోన్‌‌లో ఏముంది? అనేది మిగతా కథ.  మంజు వారియర్ ఎంత గొప్ప నటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు డబ్బింగ్‌‌ సినిమాల ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. పైగా ఈ సినిమాలో ఆమె నటన అద్భుతమంటూ రివ్యూస్ వచ్చాయి. కాబట్టి ఈ టెక్నో హారర్ మూవీ తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే అవకాశం లేకపోలేదు.