చౌటుప్పల్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి కబ్జా

చౌటుప్పల్ రిజర్వ్ ఫారెస్ట్ భూమి కబ్జా

ఖాళీ జాగా  కనిపిస్తే చాలు…కబ్జాదారులు రాబందుల్లా వాలిపోతున్నారు. ప్రైవేట్ భూమి అయినా.. ప్రభుత్వ  భూమి అయినా కన్ను పడిందంటే..కంచె వేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 25 ఎకరాల అటవీ భూమిని స్వాహా చేశారు.  కబ్జా చేయడమే కాదు.. ఏకంగా అమ్మేసి రిజిస్ట్రేషన్లు కూడా చేశారు.  ఇంత జరిగినా ఫారెస్ట్ అధికారులకు మాత్రం కబ్జా సంగతే తెలియదు. ఈ భూమి విలువ మార్కెట్ లెక్కన .. దాదాపు 50 కోట్లకు పై మాటే. ప్రభుత్వ అధికారుల  మొద్దు నిద్రకు, రియల్టర్ల  భూ దాహానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్  అంటున్నారు స్థానికులు. రిజర్వ్  ఫారెస్ట్ కు  చెందిన  25 ఎకరాల  భూమిని … అమ్ముకొని  సొమ్ము  చేసుకున్నా పట్టించుకోని  పరిస్థితిలో అధికారులు ఉన్నారంటున్నారు.  అటవీ భూమిని  ప్రైవేటు  వ్యక్తులు  దర్జాగా  రిజిస్ట్రేషన్  చేసుకున్నా తెలియని సిచ్యువేషన్ లో అధికారులున్నారు.

చౌటుప్పల్ రిజర్వ్ ఫారెస్ట్ కు సెక్షన్ 18,  హైదరాబాద్  అటవీ చట్టం  1359,  గెజిట్ 28 ప్రకారం… 367 ఎకరాల  భూమి  ఉంది. ఈ భూమి  చౌటుప్పల్,  లింగారెడ్డిగూడెం , లక్కారం గ్రామాల  సమీపంలో ఉంది. ఈ  అటవీ భూమిలో నర్సరీ,  స్మృతివనం , అర్బన్ లంగ్స్  పార్కు, TSIIC  పార్కు,  HMDA  పార్కు  ఏర్పాటు చేయడానికి అటవీశాఖ కొన్నినెలల క్రితం ప్రణాళికలు రూపొందించింది. భూమి మొత్తాన్ని సర్వే చేయించింది. అటవీశాఖకు కేటాయించిన గెజిట్,  నక్షా ప్రకారం భూమి కొలతలు తీయడంతో… భూమి కబ్జా అయినట్లు గుర్తించారు అధికారులు.

చౌటుప్పల్లో  రియల్ ఎస్టేట్  వ్యాపారం  బాగా  పెరిగింది. ఇదే అదునుగా భావించిన  కబ్జాదారులు  ప్రభుత్వానికి   చెందిన భూమిని  రిజిస్ట్రేషన్  ఫైళ్లలో  పట్టాదారుల  పేరిట మార్చి, ఆ తర్వాత ప్లాట్లు  చేసి అమ్మినట్లు తెలుస్తోంది. అటవీశాఖ  నక్షా ప్రకారం  సర్వే  బృందం పరిశీలిస్తే .. కబ్జా అయిన భూమిలో  హెచ్ఎండీఏ  అనుమతి లేకుండా  వెంచర్ చేసినట్లు తేలింది.  అయితే ఆ వెంచర్ భూమి మాత్రం..  రెవెన్యూ రికార్డుల్లో  పట్టాదారు పేరిట  ఉంది. ఈ భూమి పట్టాదారు పేరిట ఎప్పుడు మారిందనే సమాచారం కూడా అధికారుల దగ్గర లేని పరిస్థితి. దీంతో 25 ఎకరాల అటవీశాఖ  భూమి  మాయమైనట్లు.. రాష్ట్ర ఉన్నతాధికారులకు  నివేదిక  పంపిచారు అధికారులు.