
లాటిన్ అమెరికా విప్లవకారుడు చే గవేరా కుమారుడు ‘కేమిలో గవేరా మార్చ్’ గుండెపోటుతో కన్నుమూశారు. 60 ఏళ్ల కేమిలో గవేరా మృతి చెందినట్టు క్యూబా అధికారులు స్పష్టం చేశారు. ఊపిరితిత్తులలో రక్తం గడ్డ కట్టడం వల్లనే ఆయన చనిపోయినట్టు ధ్రువీకరించారు. వెనెజ్వెలా రాజధాని కారకస్‌కు వెళ్లిన కేమిలో అక్కడే గుండెపోటుతో చనిపోయారని అధికారులు వెల్లడించారు. క్యూబా విప్లవంలో ఫిడెల్ కాస్ట్రోతో కలిసి పోరాడిన తన తండ్రి చే గవేరా జీవిత విశేషాలను సేకరించడం, రికార్డ్ చేయడానికే కేమిలో తన కెరీర్లో ఎక్కువ సమయాన్ని కేటాయించారు. అందులో భాగంగా అల్బర్ట్ కోర్డా తీసిన తన తండ్రి ఫేమస్ ఫొటోగ్రాఫ్‌ను వాణిజ్య ప్రకటనలకు వాడుకోవడాన్ని కేమిలో తీవ్రంగా వ్యతిరేకించేవారు.
ఇదిలా ఉండగా చే గవేరా కుమార్తె అలైదా తమ కుటుంబం తరఫున అధికార ప్రతినిధిగా వ్యవహరించే బాధ్యత తీసుకోగా... క్యూబా రాజధాని హవానాలోని ‘సెంటర్ ఆఫ్ చే గవేరా స్టడీస్’ బాధ్యతను కేమిలో చూసుకునేవారు. తండ్రి చే గవేరా బొలీవియాలో ప్రభుత్వ దళాల కాల్పుల్లో చనిపోయినప్పటికి కేమిలో వయసు అయిదేళ్లు. కేమిలో లా చదువుకున్నప్పటికీ తన జీవితంలో ఎక్కువ భాగం తండ్రికి సంబంధించిన పత్రాలు, స్మారకాలు సంరక్షించడం... సేకరించడం వంటి పనుల్లోనే ఎక్కువగా నిమగ్నమయ్యారు. ఇక కేమిలో కుటుంబ విషయానికొస్తే.. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేమిలో తల్లి అలీదా కూడా ఆయనతోనే ఉండేవారు. చే గవేరా నలుగురు సంతానంలో కేమిలో రెండో వారు. ఆయనకు అక్క అలీదా, చెల్లెలు సెలియా, తమ్ముడు ఎర్నెస్టో ఉన్నారు. అక్క అలీదా చిన్నపిల్లల డాక్టర్ కాగా, చెల్లెలు వెటర్నేరియన్, తమ్ముడు మోటార్ సైకిల్ టూర్లు నిర్వహిస్తుంటారు.
Con profundo dolor decimos adiós a Camilo, hijo del Che y promotor de sus ideas, como directivo del Centro Che, que conserva parte del extraordinario legado de su padre. Abrazos a su madre, Aleida, a su viuda e hijas y a toda la familia Guevara March. pic.twitter.com/n7PaAVbmC2
— Miguel Díaz-Canel Bermúdez (@DiazCanelB) August 30, 2022