మహిళలే అతని టార్గెట్.. లోన్లు ఇప్పిస్తానని నగలు తీసుకుని ఉడాయిస్తాడు

V6 Velugu Posted on Apr 16, 2021

  • నిందితుడు చిట్టిబాబును అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
  • నిందితుడిపై ఇప్పటికే 9 కేసులు.. 4 సార్లు అరెస్టయినా తీరు మార్చుకోని నిందితుడు

హైదరాబాద్: చిరువ్యాపారులైన మహిళలను టార్గెట్ చేసి లోన్లు ఇప్పిస్తానంటూ నమ్మించి వారి బంగారు నగలను కొటేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి 10.4 తులాల బంగారం, సెల్ ఫోన్, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని విశాఖపట్నం జిల్లా పాయకరావు పేట మండలం కేశవరం గ్రామానికి చెందిన మేడిశెట్టి చిట్టిబాబు(25) పదో తరగతి వరకు చదివాడు. రాజేంద్రనగర్​లోని బుద్వేల్​లో ఉండే చిట్టిబాబు శివార్లలో తిరుగుతూ ఆశవర్కర్స్, హోటల్స్, పూలు, పండ్లు, కూరగాయలు అమ్మే మహిళలతో పరిచయం పెంచుకునేవాడు. వారికి తక్కువ వడ్డీకి లోన్లను ఇప్పిస్తానంటూ నమ్మించేవాడు.  తర్వాత మహిళల దగ్గరున్న బంగారు నగలను చూసి తనకు అలాంటి డిజైన్ కావాలని, ఒకసారి ఇస్తే చేయించుకుని తిరిగి ఇస్తానని చెప్పి తీసుకునేవాడు. ఇలా వారి  దగ్గరి నుంచి గోల్డ్ రింగ్స్, చైన్లను తీసుకుని వాటిని తాకట్టు పెట్టగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. తమ బంగారాన్ని తిరిగివ్వాలని ఫోన్ చేసి అడిగిన మహిళలకు రెస్పాన్స్ ఇవ్వకుండా తప్పించుకుని తిరిగేవాడు. ఇలా చిట్టిబాబుకి నగలు ఇచ్చిన ఇద్దరు బాధితులు నార్సింగి పీఎస్ లో కంప్లయింట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా చిట్టిబాబు జన్వాడలో ఉన్నట్లు గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. చిట్టిబాబు ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో లోన్స్ పేరిట మహిళలను మోసం చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఏపీలో అతడిపై 9 కేసులున్నాయన్నారు. 4 కేసుల్లో చిట్టిబాబు అరెస్ట్ అయి జైలుకి వెళ్లాడన్నారు. గతేడాది ఆగస్టు 21న బెయిల్ పై రిలీజైన చిట్టిబాబు సిటీకి వచ్చాడన్నారు. అతడిపై నార్సింగి పీఎస్ పరిధిలో 2, రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో 2, లంగర్ హౌస్ పీఎస్ లో 1 కేసు ఫైల్ అయ్యిందన్నారు. చిట్టిబాబుపై పీడీ యాక్ట్​ నమోదు చేస్తామన్నారు. 

Tagged Hyderabad, AP, arrest, visakhapatnam,

Latest Videos

Subscribe Now

More News