
- వృద్ధుడిని చీట్ చేసిన స్కామర్లు
బషీర్బాగ్, వెలుగు: సీబీఐ అధికారుల పేరుతో ఆన్లైన్ స్కామర్లు ఓ వృద్ధుడి వద్ద భారీగా డబ్బులు దండుకున్నారు. దోమల్ గూడ ప్రాంతానికి చెందిన 79 ఏళ్ల వృద్ధుడికి ఈ నెల 6న సీబీఐ అధికారి విజయ్ ఖన్నా పేరుతో కాల్ వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. నకిలీ సీబీఐ వారెంట్, ఎఫ్ఐఆర్ ను వృద్ధుడికి పంపించారు. ఈ కేసులో మీ ప్రమేయం లేకుంటే అకౌంట్ లో ఉన్న డబ్బులను బదిలీ చేయాలని, ఆర్బీఐ నిబంధనల మేరకు విచారించి పది రోజుల్లో తిరిగి చెల్లిస్తామని స్కామర్స్ చెప్పారు.
వారి మాటలను నమ్మిన వృద్ధుడు రూ.35,74,094 స్కామర్స్ అకౌంట్స్ కు బదిలీ చేశాడు. కేసులో ఆయన పేరు తొలగించామని, చెల్లించిన డబ్బులు సమీపంలోని సైబర్ క్రైం బ్రాంచ్ లో తీసుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు బషీర్ బాగ్ లోని సైబర్ క్రైం ఆఫీసుకు వెళ్లగా అదంతా స్కామర్లు చేసిన మోసమని తెలిసింది.