స్టాక్స్​లో పెట్టుబడి పేరిట చీటింగ్

స్టాక్స్​లో పెట్టుబడి పేరిట చీటింగ్
  •     రూ. 30 లక్షలు ముంచిన సైబర్ ​మోసగాళ్లు 
  •     బాధితురాలు హైదరాబాద్​లో ప్రైవేట్ ​టీచర్
  •     ఈ కేవైసీ పేరిట మరోచోట రూ.లక్ష 19 వేలు మాయం​ 

బషీర్ బాగ్ వెలుగు : హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేట్​టీచర్​ను మోసం చేసిన సైబర్ చీటర్స్ ... ఆమె నుంచి రూ. 29 లక్షల 10 వేలు కాజేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి కథనం ప్రకారం...కొద్ది రోజుల కింద సైబర్ నేరగాళ్లు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని ఓ ప్రైవేట్​స్కూల్​టీచర్​వాట్సాప్ కు మెసేజ్ పంపారు. వారు సూచించినట్టు FIS-FTPL-SIS యాప్ డౌన్ లోడ్ చేసుకున్న ఆమె అందులో ఇన్వెస్ట్​చేసింది.

 కొద్దిసేపటికి ఆ యాప్ కనిపించకపోవడంతో సైబర్ చీటర్స్ సూచన మేరకు CYEX యాప్ ను డౌన్​లోడ్​చేసి అందులోనూ ఇన్వెస్ట్​చేయడం స్టార్ట్​చేసింది. తర్వాత సైబర్ చీటర్స్ బాధిత మహిళ నంబర్​ను FIS-FTPL అనే వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశారు. వెయ్యి పెడితే రూ. పదివేలు..లక్ష పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని చెప్పడంతో రూ. 29 లక్షల 10 వేలను వారి ఖాతాలకు ట్రాన్స్​ఫర్​చేసింది. తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాధిత మహిళ ఆన్​లైన్​ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

క్రెడిట్​కార్డు కేవైసీ అప్డేట్ చేస్తామని..

క్రెడిట్ కార్డ్ కేవైసీ పేరిట హైదరాబాద్ కు చెందిన ఓ మహిళను సైబర్ నేరగాళ్లు మోసం చేసి , ఆమె క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 1, 19, 337ను కాజేశారు. సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ శివ మారుతి కథనం ప్రకారం...బాధిత మహిళకు యాక్సిస్ బ్యాంక్ నుంచి అంటూ సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా కాల్ చేశారు. ఆమె క్రెడిట్ కార్డ్ కేవైసీ చేయాలని , లేకపోతే, కార్డ్ బ్లాక్ అవుతుందని నమ్మించారు. బాధితురాలి కార్డు వివరాలను సేకరించిన తర్వాత ఆమెకు ఒక లింక్ పంపించారు. ఆమె దానిని క్లిక్ చేయడంతో ఆమె క్రెడిట్ కార్డ్ నుంచి రూ. లక్ష 19 వేల 337 రూపాయలు డెబిట్ అయ్యాయి. వెంటనే తేరుకున్న బాధిత మహిళ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ ను సంప్రదించింది. వారు కార్డ్ ను బ్లాక్ చేసి, సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయమని సూచించడంతో... ఆన్​లైన్​ద్వారా ఫిర్యాదు చేసింది.