
కొమురవెల్లి మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పరిహార చెక్కులు నిరాకరించిన వారికి ఆఫీసర్లు పోలీసు బందోబస్తు మధ్య నోటీసులు అందజేస్తున్నారు. రెండు రోజులుగా రెవెన్యూ సిబ్బంది ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని నిరాకరించిన పలువురికి నోటీసులు జారీ చేశారు. ఎవరైనా నోటీసులు తీసుకోమని భీష్మిస్తే పోలీసులను చూపించి వారికి అందజేస్తున్నారు. నిర్వాసితులు స్థానికంగా లేకుంటే ఇండ్ల గోడలకు నోటీసులను అంటిస్తున్నారు. కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, పల్లెపహాడ్‌లలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద దాదాపు 10,220 మందికి పరిహారాన్ని ప్రభుత్వం అందజేస్తోంది. జిల్లా యంత్రాంగం వారం రోజులుగా చెక్కుల పంపిణీ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. హైకోర్టులో కేసులు వేసిన వారికి ప్రత్యేకంగా నోటీసులు జారీ చేస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది వెంట పోలీసులు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో నోటీసులు తీసుకున్నామన్నారు. మరోవైపు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం చెక్కులను తీసుకోవడానికి నిరాకరించే వారి వివరాలతో పాటు వారి చెక్కులను కోర్టులో డిపాజిట్ చేయనున్నారు. కోర్టుకు జమ చేసిన చెక్కులను నిర్వాసితులు చట్టప్రకారం కోర్టు నుంచి పొందాల్సి ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరగడమెందుకని కొందరు వచ్చిన పరిహారాన్ని అందుకుంటున్నారు.