ధరణి సమస్యలకు చెక్..అన్ని రకాల భూసమస్యలకు ఒకే మాడ్యూల్

ధరణి సమస్యలకు చెక్..అన్ని రకాల భూసమస్యలకు ఒకే మాడ్యూల్
  • భూమాత పోర్టల్​తో ధరణి కష్టాలకు చెల్లు
  • రెవెన్యూ వివాదాలపై ఆన్​లైన్​లో అప్పిలేట్ అథారిటీకి వెళ్లే చాన్స్​
  • తొమ్మిది నెలల్లోనే ధరణిలో 150కిపైగా మార్పులు 
  • వచ్చే అసెంబ్లీ సెషన్స్​లో కొత్త ఆర్వోఆర్--2024 చట్టం
  • ముసాయిదా రెడీ చేస్తున్న సర్కారు

హైదరాబాద్, వెలుగు: ధరణి కష్టాలకు చెక్ పెట్టేలా అన్ని రకాల భూ సమస్యలకు ఒకే మాడ్యూల్​తో పరిష్కారం చూపాలని రాష్ట్ర ప్రభుత్వం  భావిస్తున్నది. కొత్త రెవెన్యూ చట్టం (ఆర్వోఆర్​–2024)పై  అందరి నుంచి ఇప్పటికే అభిప్రాయాలు సేకరించిన ప్రభుత్వం.. ముసాయిదాకు తుది మెరుగులు దిద్దుతున్నది. 

వచ్చిన విలువైన సూచనలను చట్టం వచ్చిన తర్వాత ఇవ్వనున్న మార్గదర్శకాల్లో పొందుపర్చాలని నిర్ణయించింది. అదే సమయంలో ఇప్పుడున్న ధరణి పోర్టల్​ పేరును మార్చి.. నిర్వహణను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోనున్నది. ఈ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేయాలనుకుంటున్నది. 

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో  కొత్త ఆర్వోఆర్​–2024 చట్టం రూపంలోకి తీసుకురానున్నట్టు రెవిన్యూ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూ సమస్యలకు సులువు పరిష్కారంగా కొత్త ఆర్వోఆర్ ​ముసాయిదా రెడీ చేస్తున్నది.  ధరణి మాడ్యుల్స్, టెక్నికల్​ ఇబ్బందులు లేకుండా భూమాత పోర్టల్​ తీసుకురానున్నది.

 ఇప్పటివరకూ ఒక్కసారి అప్లికేషన్​తిరస్కరణకు గురైతే.. అప్పిలేట్ అవకాశం లేకుండా సివిల్​కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, కొత్త చట్టంలో ఈ విధానానికి చెక్​ పెడుతున్నారు. ఈ వ్యవస్థను కూడా ఆన్​లైన్​లో చేపట్టాలని భావిస్తున్నది. 

ఇప్పటివరకూ ధరణితో ఎదుర్కొన్న ప్రతీ భూసమస్యకు కొత్త ఆర్వోఆర్​లో సులువైన పరిష్కారం ఉండేలా చూస్తున్నట్టు రెవిన్యూ ప్రిన్సిపల్​సెక్రెటరీ, సీసీఏల్ఏ నవీన్​ మిట్టల్​ ‘వెలుగు’కు తెలిపారు.  

అప్పిలేట్స్​తో తప్పనున్న తిప్పలు

కొత్త ఆర్వోఆర్​చట్టంలో అప్పిలేట్​ వ్యవస్థను తీసుకువస్తున్నారు. ఇప్పుడున్న దాని ప్రకారం ఒక భూసమస్య రిజెక్ట్​ అయితే కోర్టుకు వెళ్లి ఆర్డర్​ తెచ్చుకోవడం తప్ప ఇంకో మార్గం లేకుండా పోయింది. ఒక్క ధరణికి సంబంధించి భూముల సమస్యలపై దాదాపు 3 లక్షల దాకా అన్నిస్థాయి కోర్టుల్లో కేసులు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. 

నెలలు, ఏండ్ల తరబడి ఆర్డర్​ కోసం ఎదురుచూడడం, కోర్టు ఫీజులు, అడ్వొకేట్​ ఫీజులకు వేలు, లక్షల్లో చెల్లించుకోవడం పేద రైతులకు ఇబ్బందికరంగా మారింది. గత ప్రభుత్వం చేసిన తప్పులకు తాము బలవుతున్నామని ఎన్నోసార్లు రైతులు ఆందోళనకు దిగారు. 

ఇప్పుడు ఈ సమస్యకు చెక్​పెట్టేలా కొత్త ముసాయిదాలో ప్రభుత్వం అప్పిలేట్స్ పెట్టింది. తహసీల్దార్లు, ఆర్డీవోలు చేసే రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లకు సంబంధించి వివాదాలు వస్తే అప్పీల్, రివిజన్‌‌‌‌కు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. తహసీల్దార్లు, ఆర్డీవోలు తీసుకునే నిర్ణయాలపై అప్పీల్‌‌‌‌ను కలెక్టర్లు లేదా అడిషనల్‌‌‌‌ కలెక్టర్లకు చేసుకోవచ్చు. 

తర్వాత సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌కు కూడా వెళ్లే వెసులుబాటు కల్పించారు. సెకండ్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ మాత్రం సీసీఎల్‌‌‌‌ఏకు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్పీల్‌‌‌‌ నిబంధన పాత చట్టంలో లేదు. ఇక, రివిజన్‌‌‌‌ మాత్రం ప్రభుత్వం లేదా సీసీఎల్‌‌‌‌ఏ మాత్రమే చేయాలని బిల్లులో పొందుపరిచారు. 

గతంలో జేసీకి ఉన్న రివిజన్‌‌‌‌ అధికారాలను ఇప్పుడు సీసీఎల్‌‌‌‌ఏకి ఇచ్చారు. ఏదైనా రికార్డులో తప్పు జరిగిందని భావిస్తే సుమోటోగా తీసుకుని కూడా పరిష్కరించవచ్చు. అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌స్థాయి నుంచి ప్రభుత్వం వరకు అప్పీల్‌‌‌‌ లేదా రివిజన్లలో ఏ నిర్ణయం తీసుకున్నా లిఖితపూర్వక ఆదేశాలు ఇవ్వడాన్ని తప్పనిసరి చేశారు.

 2020 చట్టంలో ఈ అంశం లేదని, కొత్త చట్టం అమల్లోకి వస్తే భూమి హక్కుల రికార్డుల వివాదాలన్నీ అప్పీలు, రివిజన్లతోనే పరిష్కారమవుతాయని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అయితే, యాజమాన్య హక్కుల వివాదాలు, భాగపంపకాల విషయంలో వివాదాలున్నప్పుడు మాత్రమే కోర్టులకు వెళ్లే వెసులుబాటు ఇచ్చారు.  

గందరగోళం లేకుండా  సింగిల్ మాడ్యూల్​

ధరణిని తీసుకువచ్చిన కొత్తలో సాధారణ అమ్మకాలు, కొనుగోళ్లు, గ్రీవెన్స్​ తప్ప వేరే వాటికి ఆప్షన్లు ఇవ్వలేదు. క్షేత్రస్థాయిలో తీవ్ర వ్యతిరేకత రావడంతో గత ప్రభుత్వం కొద్ది రోజులకు 10 రకాల మాడ్యుల్స్​ను  తీసుకువచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా మూడేండ్లలో కొత్తగా దాదాపు 25 మాడ్యుల్స్​ను అందుబాటులో పెట్టింది. 

అయినా భూ సమస్యలకు పరిష్కారం దొరకలేదు. కొన్నిసార్లు అసలు ఏ సమస్య కోసం ఏ మాడ్యూల్​ ఇచ్చారనేది కూడా అర్థం కాకుండా అప్లికేషన్లు రిజెక్ట్ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ధరణిపై స్పెషల్​ ఫోకస్ ​పెట్టింది. 

వెంటనే ధరణిని తీసేస్తే రైతులు ఆందోళనకు గురయ్యే ప్రమాదం ఉందని, ముందు పోర్టల్‌‌లో ఉన్న సమస్యలను పరిష్కారించాలని నిర్ణయించింది. దీంతో 9 నెలల్లోనే 150కు పైగా మార్పులు చేసింది. టెక్నికల్​ అంశాలను పరిష్కరించింది. 

మాడ్యూల్స్​లోనూ ఎలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తగా మార్పించింది. కొత్త చట్టం వచ్చాక సింగిల్ మాడ్యూల్​గా మార్చాలని భావిస్తున్నది. ఈ మేరకు సాఫ్ట్​వేర్​లో మార్పులు చేస్తున్నది. సమస్యల కోసం ఒక్క మాడ్యూల్​లోనే అనేక ఆప్షన్స్​ఇవ్వనున్నారు. 

అన్ని చట్టాలపై స్టడీ చేసినం

నేను గతేడాది అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే 7 నెలల ముందే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్నా. కొత్త ప్రభుత్వం వచ్చాక పూర్తిస్థాయిలో మార్పులు తీసుకొచ్చాం. ధరణి అప్లికేషన్లపై మూడు సార్లు స్పెషల్ ​డ్రైవ్ ​పెట్టి పరిష్కరించినం. 

3 లక్షలకు పైగా అప్లికేషన్లు పెండింగ్​లో ఉంటే వాటిని లక్ష లోపునకు తగ్గించినం. కొత్త ఆర్వోఆర్ ​ముసాయిదా కోసం మంత్రి, అధికారులు, తాను దాదాపు 200 గంటలు శ్రమించినం. భూములకు సంబంధించి ప్రతీ చట్టాన్ని స్టడీ చేసినం.

 రైతులకు ఏం అవసరమో అదే ముసాయిదాలో పెట్టినం. వాటిపై అభిప్రాయ సేకరణ పూర్తి చేసినం. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి, చట్టంగా తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. ధరణి పోర్టల్​ నిర్వహణ కూడా ఎన్ఐసీకి ఇచ్చేందుకు సంప్రదింపులు పూర్తి చేసినం. 

రైతులకు తిప్పలు లేకుండా కొత్త పోర్టల్, చట్టం ఉండనుంది. ముసాయిదాలో కొన్ని లేవనే అనుమానాలు వద్దు. అవన్నీ తర్వాత ఇచ్చే మోడాల్టిస్​లో ఉంటాయి. కొత్త చట్టం వచ్చాక రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌‌‌‌ చేసేటప్పుడు సర్వే మ్యాప్‌‌‌‌ తప్పనిసరి చేస్తున్నాం 

 - నవీన్​మిట్టల్​,  రెవెన్యూ ప్రిన్సిపల్​ సెక్రటరీ, సీసీఏల్ఏ