
-
ఎన్ని చర్యలు తీసుకున్నా లాభం లేకపోవడంతోనే ..
-
ఫైల్ రెడీ చేసిన అధికారులు
-
ఈ అంశంపై రేపు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ సమావేశం
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీలో ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి చెక్ పడనున్నది. త్వరలో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం(సీఆర్ఎస్)ద్వారా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు. ఈ సిస్టంలో మైగ్రేన్ అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోసం జీహెచ్ఎంసీ వేచి చూస్తోంది. దీనికి సంబంధించి పర్మిషన్లు ఇవ్వాలని ఇప్పటికే కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఎంఏయూడీ శాఖకు లెటర్రాశారు.
ఈ ఫైల్ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇలంబరితి వద్ద ఉంది. దీంతో ఈ అంశంపై బుధవారం సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్కు జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, సెన్సస్ డిప్యూటీ డైరెక్టర్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ అధికారులు హాజరుకానున్నారు. కొత్త పద్ధతి అమల్లోకి వస్తే దేశంలో ఎక్కడి నుంచైనా బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.
ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకనే..
ఇప్పటివరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీలో అక్రమాలను అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. తరుచూ ఫేక్ సర్టిఫికెట్లు జారీ అవుతూనే ఉన్నాయి. దీంతో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (సీఆర్ఎస్) ద్వారా సర్టిఫికెట్లు జారీ చేస్తేనే అక్రమాలకు చెక్ పడుతుందని బల్దియా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. జీహెచ్ఎంసీలో నెలకి దాదాపు 22 వేల వరకు బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లు జారీ అవుతున్నాయి.
ఇందులో 17 వేల బర్త్, 6 నుంచి 7 వేల వరకు డెత్ సర్టిఫికెట్లు ఉంటున్నాయి. నెలకు జారీ అవుతున్న సర్టిఫికెట్లలో 30 శాతం మంది పేర్లలో మార్పుల కోసం తిరిగి అప్లై చేసుకుంటున్నారు. గతంలో ఎక్కువగా తప్పులు జరిగింది ఇటువంటి సర్టిఫికెట్ల విషయంలోనే. పేర్లు అనుకూలంగా మార్చుకునేందుకు తిరిగి అప్లై చేసుకోవడం, ఆ దరఖాస్తులకు అధికారులు ఇష్టానుసారంగా అప్రూవల్ ఇవ్వడం జరిగిపోయింది. ఇలా డబుల్ సర్టిఫికెట్ లను ఇవ్వకుండా అరికట్టేందుకు సీఆర్ఎస్ అడ్డుకోనుంది.
ఈ ఫేక్ సర్టిఫికెట్ల దందా గురించి తెలిసి సీరియస్అయిన గత కమిషనర్ఇలంబరితి జీహెచ్ఎంసీ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఫర్ హెల్త్(ఏఎంఓహెచ్)ను వివరణ కోరారు. కొందరు కంప్యూటర్ ఆపరేటర్లు తమకు తెలియకుండా అప్రూవల్స్ఇచ్చారని ఆయన సమాధానం చెప్పడంతో అవాక్కయ్యారు. అప్పటి నుంచి పేర్ల మార్పుల కోసం వచ్చిన దరఖాస్తుల కోసం ఓటీపీ విధానాన్ని అమలు చేశారు. సంబంధిత ఏఎంఓహెచ్ ఓటీపీ ఇస్తేనే ఆ సర్టిఫికెట్లకి అప్రూవల్ ఇచ్చేలా చేశారు. దీనివల్ల కూడా పెద్దగా మార్పు కనిపించలేదు.
ఇకపై పకడ్భందీగా లాగిన్ల జారీ..
బర్త్ అండ్ డెత్ ఫేక్ సర్టిఫికెట్లు హాస్పిటల్స్ నుంచే జారీ అవుతున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. సర్టిఫికెట్లు ఇవ్వడానికి గ్రేటర్ లో మొత్తం1823 లాగిన్లు జారీ చేశారు. ఒక్క టోలీచౌకీలోని మెట్రో హాస్పిటల్ లోనే 65 బర్త్, 8 డెత్ నకిలీ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని తెలుసుకున్నారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే, ఆఫీసర్లను, సిబ్బందిని మేనేజ్ చేసుకుని ఈ సర్టిఫికెట్లు పొందినట్లు గుర్తించారు.
విచిత్రమైన విషయం ఏమిటంటే ఆ హాస్పిటల్ క్లోజ్ అయినా సర్టిఫికెట్లు ఇస్తూనే ఉన్నారు. దీంతో హాస్పిటల్ లాగిన్ ఐడీ రద్దు చేయడంతో పాటు రిజిస్ట్రేషన్ ను క్యాన్సిల్చేయాలని సంబంధిత శాఖను కోరారు. హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ బాగోతం బయటపడడంతో అసలు ఇటువంటిని ఎన్ని ఉన్నాయో తెలుసుకునే పనిలో పడింది బల్దియా.
మొత్తం 510 హాస్పిటల్స్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ల జారీకి సంబంధించిన రిజిస్ర్టేషన్ లాగిన్ ఐడీలు పొంది ఇన్ యాక్టివ్ గా ఉన్నట్టు గుర్తించి వాటిని రద్దు చేశారు. ఇందులో ఐడీలను వినియోగించనివి కూడా ఉన్నాయి. అయితే, కొత్త సిస్టం అమల్లోకి వచ్చిన తర్వాత హాస్పిటల్స్ లాగిన్ల జారీపై మరింత పకడ్బందీగా వ్యవహరించనున్నారు. ఆ తర్వాత ఆయా హాస్పిటల్స్ పై నిఘా కూడా పెట్టనున్నారు.