హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నోళ్లకు రోజుకు రెండు సార్లు చెకప్

హోమ్ ఐసోలేషన్‌‌లో ఉన్నోళ్లకు రోజుకు రెండు సార్లు చెకప్
  • ఆశావర్కర్లు ఏఎన్‌‌‌‌ఎంలదే ఆ బాధ్యత
  • సీరియస్ అయ్యేట్లు ఉంటే హాస్పిటల్స్‌‌‌‌కు పంపాలె
  • హెల్త్ ఆఫీసర్లను ఆదేశించిన మంత్రి ఈటల

హోమ్‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌లో ఉంటున్న కరోనా పేషెంట్లను, ప్రతి రోజూ రెండుసార్లు పరీక్షించాలని అధికారులను హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఆదేశించారు. ఫీల్డ్ లెవల్లో పనిచేసే ఆశా, ఏఎన్‌‌‌‌ఎంలు.. తమ పరిధిలోని పేషెంట్ల ఇంటికి వెళ్లి ఉదయం, సాయంత్రం వారి ఆక్సిజన్ లెవల్స్‌‌‌‌, జ్వరం వంటివి చెక్ చేయాలని చెప్పారు. పరిస్థితి సీరియస్ అయ్యేట్లు ఉంటే వెంటనే హాస్పిటల్‌‌‌‌కు తరలించాలని ఆదేశించారు. ఆదివారం అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌వోలతో మంత్రి టెలీకాన్ఫరెన్స్‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకిన వాళ్ల ప్రాణాలు పోకుండా కాపాడడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉంటున్న వాళ్లు, పరిస్థితి సీరియస్ అయ్యేవరకు దవాఖానకు రావట్లేదని, అందుకే మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హోమ్ ఐసోలేషన్‌‌‌‌లో ఉన్నవాళ్లను కచ్చితంగా మానిటర్ చేయాలని,  వారికి మెడికల్ కిట్ ఇవ్వాలని సూచించారు. ప్రైవేట్ ల్యాబ్స్ లో చేసిన టెస్టుల్లో పాజిటివ్ వచ్చినవాళ్లకు కూడా కిట్లు అందజేయాలన్నారు. టెలీ మెడిసిన్ ద్వారా డౌట్స్ తీర్చాలని, ఐఎంఏ సేవలు వినియోగించుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.

ఐసోలేషన్‌‌‌‌ సెంటర్లలో బ్లడ్ టెస్టులు

ఇంట్లో ఐసోలేషన్‌‌‌‌లో ఉండే వసతి లేనోళ్లను, గవర్నమెంట్ ఐసోలేషన్ సెంటర్లకు పంపించాలని మంత్రి సూచించారు. ఇందుకు ఐసోలేషన్ సెంటర్లను పెంచాలని ఆదేశిం చారు. ప్రభుత్వ ఐసోలేషన్ సెంటర్లలో ఉంటున్న వాళ్లకు అవసరాన్ని బట్టి బ్లడ్ టెస్టులు చేయించాలని ఆదేశించారు. ఇప్పటికే ఈ విధానం హైదరాబాద్‌‌‌‌లో ఆరంభమవగా, జిల్లాల్లోనూ ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. బ్లడ్ టెస్టులతో కోవిడ్ తీవ్రత తెలుస్తుందని, దీన్ని బట్టి అవసరమైనోళ్లను హాస్పిటళ్లకు రిఫర్ చేయాలని మంత్రి ఆదేశించారు. 

తీవ్రత తగ్గుతోంది 

రాష్ట్రంలో వారం రోజులుగా కేసుల పెరుగుదల ఎక్కువగా లేదని ఈటల అన్నారు. త్వరలోనే వైరస్ వ్యాప్తి తగ్గుతుందని ఆశిస్తున్నామన్నారు. టెస్టింగ్ కిట్ల కోసం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాశానని, త్వరలోనే అవసరమైన కిట్లు వస్తాయన్నారు. కరోనా లక్షణాలుంటే టెస్టులతో సంబంధం లేకుండానే చికిత్స మొదలు పెట్టాలని, కిట్లు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఆస్పత్రుల లో అవసరమైన స్టాఫ్‌‌‌‌ను నియమించుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రైవేట్ హాస్పిటళ్లలో కరోనా ట్రీట్‌‌‌‌మెంట్ తీరును పరిశీలించాలని, అవసరమైన హాస్పిటళ్లకు ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేద్దామన్నారు. ఆక్సిజన్ అవసరం ఉన్న హాస్పిటళ్ల వివరాలు సేకరించాలని డీఎంహెచ్‌‌‌‌వోలకు సూచించారు. డాక్టర్లకు వెహికల్ అలవెన్స్‌‌‌‌ సకాలంలో అందేలా చూడాల న్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏఎన్‌‌‌‌ఎంలు, ఆశా వర్కర్ల సంఖ్యను పెంచాలన్నారు. ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న హెల్త్ స్టాఫ్ అందరికీ మంత్రి అభినందనలు తెలిపారు. కాన్ఫరెన్స్‌‌‌‌లో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ కరుణ, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.