చెడ్డీ గ్యాంగ్ కలకలం..మంచిర్యాల జిల్లా నస్పూర్తెనుగువాడలో చోరీ

చెడ్డీ గ్యాంగ్ కలకలం..మంచిర్యాల జిల్లా నస్పూర్తెనుగువాడలో చోరీ
  • సాయికుంటలో ఓ ఇంట్లోకి చొరబాటు
  • స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు 
  • తృటిలో తప్పించుకొని రైల్వే ట్రాక్ వైపు పరార్​
  • రంగంలోకి స్పెషల్​ టీమ్​లు 

మంచిర్యాల, వెలుగు: కరుడుగట్టిన దొంగల ముఠాగా పేరున్న చెడ్డీ గ్యాంగ్​మంచిర్యాలలో ఎంటరైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక నస్పూర్ తెనుగువాడ, సాయికుంట గోదారివాడ ప్రాంతాల్లో హల్​చల్​ చేసింది. స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసు వాహనాలను గమనించిన దొంగలు చెట్ల పొదల్లోంచి రైల్వే ట్రాక్​ వైపు పారిపోయారు. ఈ సంఘటనతో మంచిర్యాల ప్రజలు భయపడుతున్నారు. ప్రస్తుతం దసరా సెలవులు కావడంతో టౌన్లలో ఉంటున్న చాలామంది ఇండ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లారు. ఇదే టైమ్​లో చెడ్డీ గ్యాంగ్​ప్రవేశించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 

రాత్రి ఒంటి గంట దాటాక..

చెడ్డీ గ్యాంగ్​ రాత్రి ఒంటి గంట ప్రాంతంలో నస్పూర్​తెనుగువాడలోని పలు ఇండ్లలో చోరీకి యత్నించారు. ఓ ఇంట్లోకి చొరబడి ఐదు తులాల బంగారం ఎత్తుకెళ్లగా, మరో ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ఆ ఇంట్లో ఉన్నవారు అరిచారు. దొంగలు అక్కడినుంచి కలెక్టరేట్ వెనుకవైపు నుంచి సాయికుంట గోదారివాడకు వచ్చారు. మల్లన్న గుడి దగ్గర ఉన్న మరో ఇంట్లోకి తలుపులు తీసి చొరబడ్డారు. హాల్​లో వృద్ధురాలు పడుకొని ఉండగా, కుటుంబ సభ్యులు బెడ్రూంలో నిద్రిస్తున్నారు.

 బెడ్రూలకు బయటినుంచి గడియపెట్టి వృద్ధురాలి ఒంటిపై బంగారం ఉందేమోనని చూశారు. హాల్​లో ఉన్న రెండు బ్యాగులు తీసుకెళ్లి చెక్​చేశారు. విలువైన వస్తువులు లేకపోవడంతో వాటిని బయటపడేశారు. ఆ వెనుక లైన్​లో ఉన్న మరో రేకుల షెడ్డులో ఇద్దరు యువకులు నిద్రిస్తుండగా, వారి సెల్​ఫోన్లు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. అదే లైన్​లో మరో ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారు. 

అప్పటికే తెనుగువాడకు చెందినవారు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన డీసీసీ ఏ.భాస్కర్, ఏసీపీ ఆర్.ప్రకాశ్, టౌన్​ సీఐ ప్రమోద్​రావు, రూరల్​ సీఐ ఆకుల అశోక్ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. పోలీసులు టీమ్​లుగా విడిపోయి తెనుగువాడ, సాయికుంట ఏరియాల్లో పెట్రోలింగ్​ చేపట్టారు. 

మరోవైపు శ్రీరాంపూర్, హాజీపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి పోలీసులను అలర్ట్ చేశారు. గోదారివాడ మల్లన్న గుడి దగ్గర పోలీస్​వెహికల్​ను చూసిన దొంగలు రైల్వే ట్రాక్ ​వైపు పారిపోయారు. ఆ విజువల్స్​ ఓ ఇంట్లో ఉన్న సీసీ టీవీలో రికార్డయ్యాయి. అప్పటికి రాత్రి 2 గంటలు దాటింది. పోలీసులు ఉదయం 4.30 వరకూ గాలించినప్పటికీ చెడ్డీ గ్యాంగ్​ ఆచూకీ దొరకలేదు. వారిని పట్టుకునేందుకు నాలుగు స్పెషల్ ​టీమ్​లను రంగంలోకి దించినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. 

అడ్డొస్తే అంతు చూస్తారు

చెడ్డీ గ్యాంగ్ అంటేనే కరుడుగట్టిన దొంగల ముఠా అని పేరుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్​ప్రాంతాలకు చెందిన ఈ గ్యాంగ్​లు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన సంఘటనలున్నాయి. ఐదు నుంచి ఆరుగురు సభ్యులున్న ఈ ముఠాలు ఎక్కువగా రైల్వే ట్రాక్​సమీప ప్రాంతాలనే టార్గెట్​ చేస్తాయి. 

సాధారణ ప్రయాణికుల్లా రైళ్లలో వచ్చిపోవడానికి, అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకోవడానికి ఈ ప్రాంతాలైతే అనుకూలంగా ఉంటాయని వాటిని ఎంచుకుంటారని పోలీసులు పేర్కొంటున్నారు. చోరీ సమయంలో ఎవరైనా అడ్డొచ్చినా, ప్రతిఘటించినా ప్రాణాలు తీసేందుకు సైతం వెనుకాడరు. 

చెడ్డీ గ్యాంగ్​ను పట్టుకుంటాం

మంగళవారం రాత్రి చెడ్డీ గ్యాంగ్ ​గురించి మాకు సమాచారం రాగానే భారీ సంఖ్యలో సిబ్బందితో పది నిమిషాల్లోనే అక్కడికి చేరుకున్నాం. గోదారివాడలో దొంగలు చిక్కినట్టే చిక్కి తృటిలో తప్పించుకున్నారు. వారిని పట్టుకునేందుకు నాలుగు స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేశాం. ప్రజలు ఆందోళన చెందవద్దు. కానీ అలర్ట్​గా ఉండాలి. ఇండ్లలో, కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే మాకు సమాచారం అందించాలి. - ఆర్.ప్రకాశ్, మంచిర్యాల ఏసీపీ