నేతన్నకు ఏడాదంతా పని.. కొత్త విధానానికి సర్కారు కసరత్తు

నేతన్నకు ఏడాదంతా పని.. కొత్త విధానానికి సర్కారు కసరత్తు
  •     ‘నేతన్న భరోసా’ పేరుతో కొత్త విధానానికి రాష్ట్ర సర్కారు కసరత్తు 
  •     దీర్ఘకాలికంగా లబ్ధి చేకూరేలా అన్ని ప్రభుత్వ ఆర్డర్లు టెస్కో నుంచే సప్లై 

హైదరాబాద్, వెలుగు : నేత కార్మికుల స్వయం సమృద్ధికి ‘నేతన్న భరోసా’ అనే కొత్త విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.  చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమానికి తాత్కాలిక ప్రయోజనం కన్నా దీర్ఘకాలిక లబ్ధి చేకూరేలా ఈ విధానాన్ని తీసుకురానుంది. ఏడాది మొత్తం పని ఉండేలా ప్లాన్​ చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇండియన్  ఇన్ స్టిట్యూట్  ఆఫ్  హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు, హ్యాండ్లూమ్  పార్క్ పునరుద్ధరణ, కొత్త పవర్ లూమ్  క్లస్టర్ల అభివృద్ధి, మైక్రో హ్యాండ్లూమ్  క్లస్టర్ల ఏర్పాటు, నేషనల్ సెంటర్  ఫర్  డిజైన్ల ఏర్పాటు, స్టేట్  టెక్నికల్  టెక్స టైల్స్ పాలసీ తెచ్చేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టిందని ఉన్నతాధికారి ఒకరు ‘వెలుగు’ కు వెల్లడించారు. నేతన్నల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ పథకాలను అనుసంధానం చేయడంతో పాటు రావాల్సిన బకాయిలను తెచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ అధికారి పేర్కొన్నారు. 

టెస్కోకు రూ.255.27 కోట్ల ఆర్డర్లు

కొత్త ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని చేనేత సంఘాలకు పని కల్పించే చర్యలు చేపట్టింది. ఇప్పటికే రూ.53 కోట్ల విలువైన వస్త్రాలను కొనుగోలు చేసింది. గతంలో చేనేత సహకార సంఘాలకు పెండింగ్ లో  ఉన్న రూ.8.81 కోట్ల బకాయిలను విడుదల చేసింది. అన్ని ప్రభుత్వ శాఖలు టెస్కో ద్వారానే వస్త్రాలు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం టెస్కోలో లభ్యంకాని వస్త్రాలకు నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్  తీసుకుంటే తప్ప ప్రైవేటు ఏజెన్సీల నుంచి కొనుగోలు చేసే ప్రసక్తి ఉండదు. 

ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖలు వస్త్రాల సరఫరా కోసం టెస్కోకు రూ.255.27 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయి. గత 3 నెలల్లోనే సమగ్ర శిక్షా అభయాన్  యూనిఫాంల సరఫరాకు రూ.47 కోట్లు అడ్వాన్సుగా చెల్లించింది. నూలు కొనుగోలు,  సైజింగ్​కు నిధులిచ్చింది. నూలు కొనుగోలు కోసం మాక్స్, ఎస్ఎస్ఐ యూనిట్లు, సైజింగ్ యూనిట్లకు అడ్వాన్సులు చెల్లించింది.  

వ్యాపారులు, దళారుల జోక్యం మితిమీరేలా గత సర్కారు తీరు

గత బీఆర్ఎస్  ప్రభుత్వం చేనేత సహకార సంఘాలను విస్మరించి మాక్స్  సహకార సంఘాలను ప్రోత్సహించింది. దీంతో అసలైన కార్మికులకు లబ్ధి  చేకూరలేదని ప్రభుత్వ పరిశీలనలో వెల్లడైంది. గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులు, దళారుల జోక్యం మితిమీరింది. రాష్ట్రంలో 393 చేనేత సహకార సంఘాలు ఉంటే.. 105 చేనేత సహకార సంఘాలకు మాత్రమే పని కల్పించారు. రాష్ట్రంలో 140 మాక్స్  సొసైటీలు, 135 ఎస్ఎస్ఐ యూనిట్లు ఉన్నాయి. వాటి నుంచి గతంలో చేసిన కొనుగోళ్లు, చెల్లించిన బిల్లులు, వాటి విద్యుత్తు వాడకం పరిశీలిస్తే.. సుమారు ౩౦ శాతం బోగస్  సొసైటీలు ఉన్నట్లు ఇటీవలే ప్రాథమిక విచారణలో బయటపడింది.

 అలాగే గత బీఆర్ఎస్  ప్రభుత్వం పదేండ్లలో బతుకమ్మ చీరల పథకాన్ని వ్యాపారంగా మార్చడంపైనా కాంగ్రెస్​ ప్రభుత్వం సీరియస్​గా ఉంది. పైగా బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలను కూడా గత ప్రభుత్వం తీర్చలేదు. 2023 నవంబర్  వరకు సుమారు 488.38 కోట్లు టెస్కోకు చెల్లించలేదు. ఇందులో గత అక్టోబర్ లో పంపిణీ చేసిన బతుకమ్మ చీరలకు సంబంధించి రూ. 351.52 కోట్లను గత బీఆర్ఎస్  ప్రభుత్వం బకాయి పెట్టింది.